షర్మిల ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి తెలంగాణాలో పరామర్శయాత్రలు చేస్తున్నారో తెలియదు కానీ అపుడప్పుడు వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. జనవరి 3 నుంచి నాలుగు రోజులపాటు ఆమె మెదక్, నిజామాబాద్ జిల్లాలలో పరామర్శయాత్ర చేపట్టబోతున్నారని ఆ పార్టీ తెలంగాణా ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ నిన్న ప్రకటించారు. జనవరి 3వ తేదీన మెదక్ జిల్లా గజ్వేల్ లో పరామర్శ యాత్ర మొదలుపెట్టి ఆ జిల్లాలో మూడు రోజులు పర్యటించి మొత్తం 13 కుటుంబాలను ఓదార్చుతారు. ఈసారి ఆమె జనవరి 5తేదీన నారాయణఖేడ్ లో బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ తెలంగాణా ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్ ప్రకటించారు.జనవరి 5,6 తేదీలలో ఆమె నిజామాబాద్ జిల్లాలో ఆమె పర్యటిస్తారు. ఆరవ తేదీ సాయంత్రం ఆమె హైదరాబాద్ లో తన సోదరుడు జగన్ లోటస్ పాండ్ నివాసానికి చేరుకొంటారు.
తను ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి పరామర్శ యాత్రలు చేయడంలేదని షర్మిల చెప్పుకొంటునప్పటికీ, ఆమె యాత్రలను విజయవంతం చేయమని నల్లా సూర్యప్రకాశ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునీయడం వలన వాటిని రాజకీయ యాత్రలుగానే పరిగణించవలసి ఉంటుంది. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలని తాపీగా ఆరేళ్ళ తరువాత వెళ్లి ఓదార్చడం ఒక విచిత్రమనుకొంటే, ఆ ఓదార్పు యాత్రని విజయంతం చేయాలని వైకాపా నేతలు పిలుపు ఇవ్వడం మరో విచిత్రం. సాధారణంగా ఏదయినా ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తున్నప్పుడు దానిని విజయవంతం చేయమని ప్రజలకు, పార్టీ నేతలకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేయడం వింటాము. కానీ చనిపోయిన ఒక వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఏమిటో?