రాజకీయంలో విజయం ఎక్కడ ఉంటుందంటే.. వారి ఎజెండాలోకి ఇతర పార్టీని లాగేసినప్పుడే వస్తుంది. వైఎస్ షర్మిల ఈ విషయంలో అన్న జగన్ మోహన్ రెడ్డిని మించిపోయారు. వైఎస్ వివేకా హత్య కేసు కేంద్రంగా కడపలో.. రాష్ట్రంలో రాజకీయం మారిపోవాలని ఆమె వేసిన ట్రాప్ లో వైసీపీ పడిపోయింది. మేనత్తను దించి… చెల్లెళ్లపై ఎెదురుదాడి చేయించడంతో నిండా కూరుకుపోయారు. ఇక ఈ రచ్చ ఆగదు. ప్రతీ ఆరోపణకూ వైసీపీ సమాధానం చెప్పాల్సిందే. కడపలో ప్రచారం చేసిన ప్రతీ సారి జగన్ కూడా నోరు విప్పాల్సిందే.
షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొదటి అడుగులో అవినాష్ రెడ్డిని నేరుగా హంతకుడిగా అభివర్ణించారు. అలా అన్న తర్వాత అవినాష్ రెడ్డి మనిషి పుట్టుక పుట్టలేదని తిట్టారు. వెంటనే షర్మిల తనను వైఎస్ కు పుట్టులేదంటున్నారని రాజకీయ విమర్శలు చేశారు. తర్వాత కొంగు పట్టుకుని అడుగుతున్నా న్యాయం చేయలని ప్రజల్ని అడిగారు. అలా అడిగితే ప్రజలు కరిగిపోతారని అర్థమైన వెంటనే… విమలారెడ్డిని రంగంలోకి దింపారు. కానీ షర్మిల వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఈ బాధ అంతా ఎందుకని అవినాష్ రెడ్డిని మార్చాలని జగన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వెంటనే షర్మిల ఈ అంశంలోనూ జగన్ ఆలోచనలకు బ్రేక్ వేసేలా ప్లాన్ చేసుకున్నారు. మారుస్తున్నారంటే.. జగన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డినే హంతకుడని అంగీకరించినట్లే కదా అంటున్నారు.
షర్మిలకు వైసీపీ స్పందన ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఆమె సోదరి, వివేకా కుమార్తె సునీతతో కలిసి .. అన్యాయమైపోయిన ఆడబిడ్డమని అండగా ఉండాలని కోరుతూ ప్రచారం మరింత ఉద్ధృతం చేయనున్నారు. ఇప్పుడు షర్మిల, సునీత చేస్తున్నప్రతి విమర్శకు కౌంటర్ గా సమాధానం ఇవ్వాల్సిందే. అది ప్రజల్లో మరింత చర్చకు కారణం అవుతుంది. అదే సమయంలో ఏమీ మాట్లాడకపోతే వారు చేస్తున్న ఆరోపణలు నిజమనుకునేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ అంశాన్ని రాజకీయ ఎజెండాగా మార్చాలనుకున్న షర్మిల ప్లాన్ లో వైసీపీ తప్పక భాగం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.