తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం అయితే అన్న జగన్మోహన్ రెడ్డితో పోరాటానికైనా సిద్ధమని.. ఎక్కడా వెనక్కి తగ్గబోనని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. పార్టీ కసరత్తు ప్రారంభించిన తర్వాత ఆమె తొలి సారిగా కొంత మంది మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై ఎక్కువ వివరణ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావొచ్చు.. విభజన వివాదాల విషయంలో కావొచ్చు… రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సవాలక్ష వివాదాల్లో కావొచ్చు.. ఏ సందర్భంలో అయినా… తాను తెలంగాణ వైపునే ఉంటానన్నారు.
ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పటికీ.. ఆయనతో కొట్లాడతానని స్పష్టం చేస్తున్నారు. వైసీపీలో తనకు ప్రాధాన్యం దక్కని మాట నిజమేనని.. అయితే ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదో.. జగన్నే అడగాలని జర్నలిస్టులకు సూచించారు. తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని అయితే జగన్‌తో తనకు పార్టీ పరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అంతే కాదు.. తనకు తల్లి విజయమ్మ సపోర్ట్ ఉందన్నారు. తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డనని షర్మిల తేల్చేశారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ఇక్కడ ప్రజల శ్రేయస్సుకోసం .. రాజన్న బిడ్డగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నానని… త్వరలోనే అధికారికంగా పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. మే 14న పార్టీని ప్రకటించి… పాదయాత్ర చేయనున్నట్లుాగ చెబుతున్నారు. పాదయాత్రలో అమర వీరుల కుటుంబాలను పరామర్శిస్తానంటున్నారు. లోటస్‌పాండ్‌లోని నివాసం నుంచే పార్టీ ప్రస్థానం మొదలవుతుందని స్పష్టం చేశారు షర్మిల. మొత్తానికి జగన్‌తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయినట్లుగా ఆమె నేరుగానే చెబుతున్నారు.