వైఎస్ఆర్ తెలంగాణపార్టీని ప్రకటించిన షర్మిలకు ఇప్పుడు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ పేరు పై అభ్యంతరాలు వ్యక్తమయినట్లుగా ఎన్నికల సంఘం చెబుతోంది. వైఎస్ఆర్ అనే పేరు ఉపయోగించుకునే అంశంపై అన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యంతరాలు వచ్చాయని అందుకే పేరును పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయలేదని తెలుస్తోంది. ఇతర పేర్లు ప్రతిపాదించాలని సూచించామని ఈసీ తెలిపింది.
గతంలో వైఎస్ఆర్సీపీ పేరుతో వైఎస్ఆర్ పేరును తొలగించాలని ఆ పార్టీ పూర్తి పేరు యువజన, శ్రమిక, రైతు కాంగ్రెస్ అనేది వాడుకోవాలని.. వైఎస్ఆర్ పేరును వాడుకోవడం వల్ల తన పార్టీకి ఇబ్బందులొస్తున్నాయని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు షర్మిల పార్టీ పేరుపైనా ఆయనే ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదు పరిస్థితి ఏమిటని ఆయన ఆరా తీస్తే ఇంకా షర్మిల పార్టీ రిజిస్టర్ కాలేదని సమాధానం వచ్చింది.
వైయస్ షర్మిల పార్టీని రిజిష్టర్ చేయలేదని, మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని షర్మిలకు లేఖ కూడా రాసినట్లు ఎన్నికల సంఘం తెలిపిందని అన్న వైఎస్ఆర్ పార్టీ నేతలు చెబుతున్నారు. షర్మిల ఇప్పుడు ఏపీ వైపు కూడా చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదే అవకాశంగా తీసుకుని తెలంగాణ అనే పేరు లేకుండా రెండు రాష్ట్రాల్లో ఉపయోగపడేలా పార్టీ పేరునుఖరారు చేసుకుంటారన్న చర్చ జరుగుతోంది.