వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో షర్మిల స్టేట్మెంట్ను సీబీఐ రికార్డు చేసినట్లుగా ఢిల్లీ నుంచి సమాచారం అనధికారికంగా లీక్ అయింది. ఈ కేసులో రేపో మాపో… విచారణను ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న సునీత పిటిషన్పై సుప్రీంకోర్టులో తీర్పు రానుంది. ఈ సమయంలో బయటకొచ్చిన ఈ వాంగ్మూలం వ్యవహారం సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరంపై అవినీతి పేరుతో విచారణకు ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి గత నెలలో షర్మిల సెప్టెంబర్లో వెళ్లారు. కానీ ఆమె వెళ్లిన ప్రధానమైన పని వాంగ్మూలం ఇవ్వడానికేనని చెబుతున్నారు.
వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ నోటీసులు జారీ చేసిందని.. కడప లేదా ఢిల్లీల్లో వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని సీబీఐ సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో షర్మిల కడప కంటే ఢిల్లీలోనే బెటర్ అని ఎంచుకున్నారు. ఈ విషయంలో మరో ప్రచారం జరగకుండా కాళేశ్వరంపై అవినీతి పేరుతో ఫిర్యాదును వాడుకున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం మెల్లగా బయటకు వచ్చింది. ఆ వాంగ్మూలలంలో కూడా వివేకాను అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చంపించి ఉంటారని నమ్మకం షర్మిల వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
షర్మిల ఇలా వాంగ్మూలం ఇచ్చినట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ రూఢీగా బయటకు రాలేదు. ఇప్పుడు ఆ విషయం వెలుగులోకి రావడంతో రాజకీయంగా కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు విచారణను ఇతర రాష్ట్రాలకు తరలించే అంశంలో సుప్రీంకోర్టు ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది. ఎక్కడికి తరలిస్తారన్నది తేలిన తర్వాత షర్మిల వాంగ్మూలం.. ఇతర ఆధారాలు వెలుగులోకి వచ్చి. కేసుకు ఓ తార్కిక ముగింపు వచ్చే అవకాశం ఉంది.