సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా ఫ్లాప్‌తో నష్టపోయిన వాళ్లందరి కోసం కాటమరాయుడు మొదలెట్టాడు పవన్‌కల్యాణ్. ఈ సినిమా ఉద్దేశం… సర్దార్ లెక్క సరిచేయాలనే. అయితే సర్దార్ కొని, రోడ్డున పడ్డ వాళ్లెవ్వరికీ కాటమరాయుడు సినిమాని అమ్మలేదని, కొత్త బయ్యర్లు వచ్చి చేరారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై చిత్రబృందం ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టమైన ప్రకటనా చేయలేదు. ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది. కాటమరాయుడు సినిమా చుట్టేశారని, క్వాలిటీ విషయంలో రాజీ పడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాత శరత్ మరార్ బిజినెస్‌లో దిట్ట. రాబడి – ఖర్చు విషయంలో ఆయన చాలా పక్కాగా ఉంటారు. పవన్ మార్కెట్ ఎంతో ఆయనకు తెలుసు. ఎంత పెడితే… ఎంత వస్తుందో ఇంకా బాగా తెలుసు. పవన్ కల్యాణ్ మార్కెట్ రూ.50 కోట్లు అనుకొంటే.. ఇప్పటి నిర్మాతలు రూ.60 కోట్లు పెట్టడానికి రెడీ అంటారు. కానీ శరత్ మాత్రం.. పవన్ మార్కెట్ రూ.50 కోట్లు అంటే.. ఈ సినిమాని రూ.25 కోట్లలో తీశార్ట. దాన్ని బట్టి ఎంత పిసినారి తనంతో వ్యవహరించారో అర్థమైపోతోంది. సర్దార్ని కొన్న రేట్లకే కాటమరాయుడుని కొనకపోవొచ్చు. అంత మాత్రాన.. మరీ ఇంత చుట్టేయాల్సిన అవసరం లేదన్నది ఇండ్రస్ట్రీ వర్గాల మాట. ఫర్ సపోజ్ కాటమరాయుడు కూడా ఫ్లాప్ అయితే.. అప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టాల్ని భర్తీ చేయాల్సివస్తుందని, అందుకే శరత్ మరార్ తెలివిగా వ్యవహరించారని వెనకేసుకొస్తున్నవాళ్లూ ఉన్నారు. ట్రైలర్ విడుదలైతే.. తప్ప కాటమరాయుడ్ని చుట్టేశారా, లేదంటే క్వాటిలీతో తీశారా అనేది అర్థం కాదు. మరి శరత్ మరార్ ఏం మాయ చేశాడో చూడాలి.