ఎన్టీఆర్ బయోపిక్ లో నటీనటుల ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా సాగిపోతోంది. నిన్నా మొన్నటి వరకూ టీమ్‌లో నందమూరి బాలకృష్ణ తప్ప మరో పేరు ఖరారు కాలేదు. ఇప్పుడు వరుసగా పాత్రలు ఓకే అయిపోతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు పాత్రకు రానా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించబోతోంది. ఇప్పుడు శర్వానంద్ పేరు కూడా ఖాయమైపోయింది. యుక్త వయసు ఎన్టీఆర్ పాత్రలో.. శర్వానంద్ కనిపించనున్నాడని టాక్. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఎన్టీఆర్ యవ్వన దశలో సన్నగా, చలాకీగా ఉండేవారు. ఆ పాత్రలోనూ బాలయ్యే కనిపిస్తే బాగోదు. అలా కనిపించాలంటే బాలయ్య బాగా తగ్గాలి. ఇప్పుడు అంత సమయం లేదు. అందుకే.. ఆ పాత్ర కోసం ఓ యువ హీరోని తీసుకోవాలని ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా శర్వానంద్‌కి కథ చెప్పడం, శర్వా ఓకే అనడం జరిగిపోయాయి. క్రిష్ ఈ ప్రాజెక్ట్ ని చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 2018 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.