టాలీవుడ్‌కి ఏదో అయ్యింది. వరుసగా యువ హీరోలంతా గాయాలబారీన పడుతున్నారు. మొన్న నాగశౌర్య కాలికి గాయమైంది. నిన్న సందీప్ కిషన్ ఫైట్ చేస్తుండగా గాయపడ్డాడు. ఇప్పుడు శర్వానంద్ కూడా గాయాలబారీన పడ్డాడు. స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా శర్వా ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సివస్తోంది.
శర్వా కొత్త సినిమా 96లో కొన్ని స్కై డైవింగ్‌కి సంబంధించిన కొన్ని షాట్స్ ఉన్నాయి. వాటి కోసం థాయ్‌లాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు శర్వా. అందులో భాగంగానే సరిగా లాండ్ అవ్వకపోవడంతో భుజాలకు గాయమైంది. కాలికీ దెబ్బతగిలింది. దాంతో హుటాహుటిగా థాయ్ లాండ్ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. వైద్యులు శర్వాని పరీక్షించి.. భుజానికి ఆపరేషన్ చేయాలని సూచించారు. సోమవారం శర్వాకి ఆపరేషన్ జరగబోతోంది. ఆ తరవాత కనీసం నాలుగు రోజులు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.