టాలీవుడ్లో మోస్ట్ ప్రామిసింగ్ కథానాయకుల్లో శర్వానంద్ పేరు కూడా ఉంటుంది. వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకొన్నాడు శర్వా. తనతో సినిమా అంటే.. డబ్బులు తిరిగి వచ్చేయడం ఖాయం అనే భరోసా కలుగుతోంది నిర్మాతలకు. బరిలో ఇద్దరు అగ్ర హీరోలున్నా సరే, వాళ్లతో పోటీ పడి మరీ ఈ సంక్రాంతికి `శతమానం భవతి`తో భారీ విజయాన్ని అందుకొన్నాడు. అది చాలు.. శర్వానంద్‌కి ఉన్న ఫాలోయింగ్‌ని అంచనా వేయడానికి. ఇప్పుడు తొలిసారి తన కెరీర్లో పోలీస్ వేషం కట్టాడు. అదే… ‘రాధ’. ఈ చిత్రం రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శర్వానంద్‌తో తెలుగు 360 డాట్ కామ్ చేసిన చిట్ చాట్.
హాయ్ శర్వా..
హాయ్
సినిమా విడుదలకు ముందు టెన్షన్ ఏమైనా ఉంటుందా?
మామూలే కదండీ. రేప్పొద్దుట సినిమా చూసి మీరేమంటారో, ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే భయం ఉంటుంది.
వరుసగా ఇన్ని హిట్లు కొట్టినానా..?
ఏ సినిమాకి ఆ సినిమానే. రెండు మూడు హిట్లు వచ్చాయని ప్రేక్షకులు ఏం చేసినా చూసేయరు. ఏ సినిమాకి ఆ సినిమా బాగుండాల్సిందే.
హిట్లు మీలో కాన్ఫిడెన్ప్ని పెంచడం లేదా?
దాంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది కదా? నా సినిమాని చూడ్డానికి జనం వస్తున్నారంటే… ఆ నమ్మకాన్ని ప్రతి సినిమాకీ నిలబెట్టుకోవాల్సిందే. వాళ్లని మరింతగా అలరించడానికి ఏం ఉన్నాయో చూసుకోవాల్సిందే. విజయాలు అనుక్షణం అప్రమత్తతగా ఉండేలా చేస్తుంటాయి. చేయాలి కూడా.
మరి రాధలో ఆకట్టుకొనే అంశాలు ఏమున్నాయి?
చాలా ఉన్నాయి. బేసిగ్గా ఇదో ఎంటర్టైన్మెంట్ సినిమా. కొత్త కథ అని చెప్పను గానీ, ట్రీట్మెంట్ బాగుంటుంది. ప్రతీ సన్నివేశం హాయిగా నవ్విస్తుంది.
ట్రైలర్ చూస్తుంటే మీ క్యారెక్టర్లో గబ్బర్ సింగ్ ఛాయలు కనిపిస్తున్నాయి..
నా సినిమాకీ పవన్ గబ్బర్ సింగ్‌కీ పోలిక ఎందుకండీ బాబు. ఆయన ఆయనే. నేను నేనే. రాధ క్యారెక్టర్ చాలా జోవియల్‌గా ఉంటుంది. నేను ఎవ్వరినీ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించలేదు. శర్వానంద్ పోలీస్ పాత్ర చేస్తే ఎలా ఉంటుందో… ఈ సినిమా అలానే ఉంటుంది.
మాస్, యాక్షన్ బాట పట్టేసినట్టేనా?
అదేం కాదు. అన్ని పోలీస్ కథలూ ఒకేలా ఉండాలని రూలేం ఉంది? ఈ సినిమాలో కృష్ణుడిలా అల్లరి చేస్తుంటాడు. యాక్షన్, ఫైట్స్ ఇవి ఉన్నా.. నా స్థాయిలోనే ఉంటాయి. ఇదో చక్కటి ఎంటర్టైనర్. అది మాత్రం చెప్పగలను.
ట్రైలర్లో భగవద్గీత శ్లోకాలు వినిపిస్తున్నారు. ఎప్పుడైనా భగవద్గీత తిరగేశారా?
నాక్కొంచెం భక్తి ఎక్కువే నండీ. అప్పుడప్పుడూ.. భగవద్గీత వింటుంటా. కొన్ని.. శ్లోకాలు గుర్తే. ఈ సినిమాలో కూడా ఆ శ్లోకాల ప్రస్తావన ఉంటుంది. అయితే సీరియెస్‌గా కాదు, సరదాగానే.
సీరియెస్ కథలు వదిలి.. ఎంటర్టైన్మెంట్ బాట పట్టినట్టేనా?
రన్ రాజా రన్‌తో నా ప్రయాణం మారిపోయింది. ఎంటర్టైన్మెంట్ కథలకు విజయాలు దక్కాయి. ఓ సినిమా ఎక్కువమందికి చేరువ అయితే.. అంతకంటే కావల్సింది ఏముంది? అయితే.. గమ్యం, ప్రస్థానం, అందరి బంధువయా లాంటి చిత్రాలు నటుడిగా నన్ను నిలబెట్టాయి. ఇప్పటికీ ఓ సీరియెస్ కథ వస్తే చేయడానికి నేను సిద్దమే.
శతమానం భవతి చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డు వస్తుందని ఊహించారా?
ఓ మంచి సినిమా చేస్తున్నామని తెలుసు. కానీ ఈ స్థాయిలో దాన్ని ఆదరిస్తారని అస్సలు ఊహించలేదు. చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. కథ ఎప్పుడూ తప్పు చేయదు. దాన్ని సరైన సమయంలో విడుదల చేయడం కూడా కలిసొచ్చింది.
పెద్ద దర్శకులతో చేయరా?
చేస్తానండీ. అయితే కొత్త దర్శకులతో అంతా బాగానే ఉంది కదా? నెమ్మదిగా ఎదగాలి. అన్నీ ఒకేసారి చేసేయాలని లేదు.
మళ్లీ తమిళంలో ఎప్పుడు సినిమా చేస్తారు?
అక్కడి ప్రేక్షకుల మైండ్ సెట్ వేరు. అన్ని కథలూ అక్కడ చేయలేం. వాళ్ల అభిరుచికి తగిన కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా.
దశరథ్‌తో సినిమా చేస్తున్నార్ట..
ఇంకా ఏం అనుకోలేదండీ. కథ వినలేదు. విన్న తరవాతే నా నిర్ణయం చెబుతా.
ఓకే.. ఆల్ ద బెస్ట్
థ్యాంక్యూ..