ఆర్.ఎక్స్ 100తో ఆకట్టుకున్నాడు అజయ్ భూపతి. అంతటి హిట్ తరవాత కూడా మరో సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఓ కథతో రవితేజతో కొంతకాలం ట్రావెల్ చేశాడు. కానీ.. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఆ తరవాత శర్వానంద్ దగ్గరకు వచ్చాడు. ఆ కథే `మహా సముద్రం`. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. శర్వా – అజయ్ భూపతి కాంబినేషన్ లో `మహా సముద్రం` నిర్మించనున్నట్టు ఏకే సంస్థ ప్రకటించింది. శర్వా చేతిలో రెండు సినిమాలున్నాయిప్పుడు. శ్రీకారంతో పాటు మరో సినిమా చేస్తున్నాడు. ఇవి రెండూ ఈ యేడాది చివరి నాటికి పూర్తవుతాయి. 2021 ప్రధమార్థంలోనే `మహా సముద్రం` పట్టాలెక్కనుంది. విశాఖ పట్నం నేపథ్యంలో సాగే కథ ఇది. మహా అన్నది అమ్మాయి పేరు. కథానాయికగా ఆ పాత్ర చాలా కీలకం. ఓ ప్రముఖ కథానాయిక మహా గా కనిపించబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.