ఈమధ్య టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు… హేషమ్ అబ్దుల్ వాహబ్. ‘ఖుషి’, ‘హాయ్ నాన్న’ సినిమాల్లో సూపర్ హిట్ పాటలు ఇచ్చారు. ఇప్పుడు శర్వానంద్ ‘మనమే’ చిత్రానికీ ఆయనే స్వరాలు అందిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఇక నా మాటే’ ఈరోజు విడుదలైంది. హేషమ్ స్వరపరచడమే కాదు, ఈ పాటని పాడాడు కూడా. కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. విదేశాల్లోని అందమైన లొకేషన్లలో ఈ పాటని తెరకెక్కించారు. ఒంటరి జీవితంపై… హీరో ఫిలాసఫీ చెప్పే గీతం ఇది.
”ఐఫీల్ టవరే ఒంటరిగా
ఉందే చాలా అందంగా
గొప్పవి ఎప్పుడూ ఒకటేగా
తెలుసా దిల్ రూబా..
పగలు చీకటి పద్ధతిగా
ఉంటాయే విడివిడిగా” – అంటూ సోలో లైఫే సో బెటరంటూ హితబోధ చేశారు ఈ పాటలో. లిరిక్స్ సింపుల్ గా, పద్ధతిగా సాగాయి. శర్వా కాస్ట్యూమ్స్, స్టైలింగ్, స్టెప్పులూ అన్నీ డిఫరెంట్ గా కుదిరాయి. ‘మనమే’ సంగీత ప్రయాణంలో ఇది మంచి ఆరంభమే అనుకోవొచ్చు. ‘హాయ్ నాన్న’లోని ‘ఓడియమ్మ బీటూ..’ అనే బీటు ఛాయలు చరణాల్లో ప్రతిధ్వనించింది. ఆ సినిమాకీ, ఈ సినిమాకీ ఒక్కడే సంగీత దర్శకుడు కాబట్టి, ఓకే అనుకోవొచ్చు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.