అనగనగా ఓ ధీరుడు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి. ఆ సినిమా సరిగా ఆడలేదు. సుదీర్ఘ విరామం తరవాత సైజ్ జీరోతో మరో ప్రయత్నం చేసినా నెరవేరలేదు. ఆర్కా మీడియా పతాకంపై ముచ్చటగా మూడో ప్రయత్నం మొదలెట్టాడు ప్రకాష్. ఈసారి హీరోగా శర్వానంద్‌ని ఎంచుకొన్నారు. కథా చర్చలు కూడా జరిగాయి. 2018 ప్రధమార్థంలో ఈసినిమా పట్టాలెక్కుతుందనుకొన్నారు. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ టీమ్ నుంచి శర్వానంద్ తప్పుకొన్నాడని తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలో శర్వా ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. ‘కాల్షీట్లు సర్దుబాటు కావడం లేదు’ అనే కారణంతో ఈ సినిమా వదులుకొన్నా.. కథలో హీరో కంటే హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉందని, అది నచ్చకే శర్వా క్విట్ అయ్యాడని తెలుస్తోంది. శర్వా స్థానంలో మరో కథానాయకుడి కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది. అయితే ఆర్కా మీడియా సంస్థలో శర్వా ఓ సినిమా చేయడం ఖాయమని… మరో కథ తీసుకొస్తే శర్వా తప్పకుండా చేస్తాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.