పెద్ద సినిమాలతో పోటీ పడడానికి చాలా సాహసం కావాలి. అదీ పండగ సీజన్లో. ఈ విషయంలో శర్వానంద్ పెద్ద రిస్క్ చేస్తున్నాడు. శర్వా 25వ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆ తరవాత శతమానం భవతి సినిమా ఉంటుంది. దిల్‌రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి వేగ్నేశ సతీష్ దర్శకుడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపాలన్నది చిత్రబృంద నిర్ణయం. అయితే ఈ సంక్రాంతి సీజన్ అంత ఆషామాషీగా ఉండదు. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున చిత్రాలు సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. చిరు కత్తిలాంటోడు చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. మరోవైపు గౌతమి పుత్ర శాతకర్ణిని కూడా సంక్రాంతికే విడుదల చేయనున్నారు. నాగార్జున – కె.రాఘవేంద్రరావుల ఓం నమో వేంకటేశాయ ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమాని కూడా పొంగల్‌కే విడుదల చేస్తారట.
వీటిమధ్య శర్వానంద్ శతమానం భవతి కూడా వచ్చేస్తుంది. అంటే.. ముగ్గురు స్టార్ హీరోల సినిమా లమధ్యలో పడబోతోందన్నమాట. అయినా సరే.. శర్వా సంక్రాంతికే టార్గెట్ పెట్టాడు. ఈ యేడాదీ అంతే కదా? నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయిన సినిమాలో పోటీగా ఎక్స్‌ప్రెస్ రాజాని రిలీజ్ చేశారు. అయినా సరే.. పెద్ద సినిమాలతో పోటీ పడి మంచి వసూళ్లనే సాధించింది. అదే నమ్మకంతో ఈసారీ.. సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు శర్వా. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.