ఆర్.ఎక్స్ 100 తరవాత ఎట్టకేలకు తన తదుపరి సినిమా మొదలుపెట్టబోతున్నాడు అజయ్ భూపతి. శర్వానంద్ తో `మహా సముద్రం` తెరకెక్కించబోతున్నాడు. సిద్దార్థ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 2021 జనవరిలో ఈసినిమా మొదలయ్యే ఛాన్సుంది. మహా.. ఓ అమ్మాయి కథ ఇది. విశాఖ తీరంలో సాగుతుంది. కాబట్టి `మహా`సముద్రం అనే పేరు పెట్టారు. కథానాయిక పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్రం కోసం ఇప్పుడు అన్వేషణ మొదలైంది. మహా పాత్రలో… సాయి పల్లవి కనిపించే ఛాన్సుందన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఇప్పటికే… సాయి పల్లవితో సంప్రదింపులు మొదలు పెట్టింది చిత్రబృందం. శర్వా – సాయి ఇది వరకే `పడి పడి లేచె మనసు`లో జోడీ కట్టారు. ఆ సినిమా జనాదరణ పొందలేదు. కానీ… ఈ జంట కెమిస్ట్రీ బాగానే పండింది. అందుకే మరోసారి ఈ జోడీని రిపీట్ చేయాలనుకుంటున్నారు. అయితే సాయి పల్లవి చేతిలో చాలా సినిమాలున్నాయి. చిరు చేయబోతున్న ఓ రీమేక్ సినిమాలో సాయిపల్లవి ఓ కీలక పాత్ర పోషిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈరెండు సినిమాలూ ఒకేసారి మొదలయితే మాత్రం సాయి పల్లవి డేట్లు దొరకడం కష్టమే.