టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తుందిప్పుడు. కథానాయకులు పారితోషికాలతో పాటు లాభాల్లో ‘వాటా’లూ అందుకొంటున్నారు. ఉదాహరణకు ఓ కథానాయకుడి పారితోషికం పది కోట్లనుకొంటే. రూ.5 కోట్లని రొక్కంగా తీసుకొని, మరో రూ.5 కోట్లని సినిమాలో పెట్టుబడిగా పెడుతున్నాడు. దాంతో.. నిర్మాతకు భారం కాస్త తగ్గుతోంది. సినిమా హిట్టయితే.. ఆ లాభాల్లో హీరోలకు వాటా వెళ్తోంది. అయితే నిన్నా మొన్నటి వరకూ ఈ వాటా పద్ధతి.. బడా హీరోలకే పరిమితమై ఉండేది. మహేష్ బాబు, పవన్ కల్యాణ్… ఇలాగన్నమాట. అయితే.. ఇప్పుడు మీడియం రేంజు హీరోలు కూడా వాటాలపై దృష్టి పెట్టారు. తాజాగా శర్వానంద్ కూడా ‘వాటా’ విధానంపై ఆసక్తి చూపిస్తున్నాడు.
వరుస విజయాలతో చిన్న హీరో నుంచి మీడియం సైజు హీరోగా మారిపోయాడు శర్వానంద్. తన సినిమా అంటే మినిమం పది కోట్లయినా బడ్జెట్‌గా పెట్టాల్సిందే. అయితే బడ్జెట్ విషయంలో శర్వా చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాడట. ‘ఇన్ని కోట్లు దాటకూడదు’ అంటూ ముందే గీత గీస్తున్నాడట. దాంతో… సినిమాని సాధ్యమైనంత వరకూ సేఫ్ జోన్ల ఉంచుకొంటున్నాడు. నిర్మాతకు మరింత భరోసా ఇవ్వాలన్న ఉద్దేశమో ఏమో.. పారితోషికం బదులుగా సినిమాలో వాటా అందుకోవడానికి మొగ్గు చూపిస్తున్నాడట. ఇందులో మరో లాభసాటి బేరం కూడా ఉంది. శర్వా పారితోషికం ప్రస్తుతం రూ.3 కోట్ల లోపు పలుకుతోంది. రూ.10 కోట్లలో సినిమా తీసి.. దానికి రూ.20 కోట్ల బిజినెస్ జరిగితే.. దాదాపుగా రూ.10 కోట్లు లాభం. పారితోషికంగా ఓ రూ.2 కోట్లు తీసుకొని, లాభాల్లో వాటాగా మరో రూ.3 కోట్లు రాబడితే.. సడన్‌గా పారితోషికం రెట్టింపు అయిపోతుందన్నమాట. అందుకే.. ‘వాటా’కి ఓటేస్తున్నాడు శర్వా.