చిన్నపాటి విమర్శల్ని కూడా ఈ తరం తట్టుకోలేకపోతోంది. మరీ ముఖ్యంగా రివ్యూల్ని భూతద్దంలో పెట్టి చూస్తోంది. ‘ఈ సినిమాలో లోపాలున్నాయి’ అని చెబితే…. సోషల్ మీడియా సాక్షిగా చెలరేగిపోతున్నారు. రివ్యూల్ని ఏకిపడేస్తున్నారు. ‘అసలు మీకు మాకు చెప్పే అర్హత ఉందా’ అన్నట్టు వాదిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో… శర్వానంద్, వరుణ్‌తేజ్‌లు కాస్త భిన్నంగా కనిపించారు. వీరిద్దరి సినిమాలూ ఈనెల 21న విడుదలయ్యాయి. టాక్స్ అంతంత మాత్రమే. ఏ రివ్యూలు చూసినా ప్లస్సుల కంటే మైనస్సులే ఎక్కువగా కనిపించాయి. అయితే వాటిని ఈ ఇద్దరు కథానాయకులూ హుందాగా స్వీకరించిన విధానం మాత్రం బాగుంది.
ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో వరుణ్ తేజ్ ‘మైనస్సుల’ గురించీ మాట్లాడాడు. ప్రతీ సినిమాకీ కొన్ని ప్లస్సులతో పాటు మైనస్సులు ఉంటాయని, ఈ సినిమాపై వచ్చిన రివ్యూల్ని గమనించానని, అందులో వ్యక్తపరిచిన అభిప్రాయాలకు విలువ ఇస్తానని, మరోసారి ఇలాంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్త పడతానని చెప్పుకొచ్చాడు వరుణ్. ఇప్పుడు శర్వానంద్ వంతు వచ్చింది. సక్సెస్ మీట్ అనగానే ‘ఆహా.. ఓహో’లే ఎక్కువగా వినిపిస్తాయి. మేం చితగ్గొట్టేశాం, వసూళ్ల వర్షం కురుస్తోంది అంటూ… మైకు పట్టుకుని ఊదరగొట్టేస్తుంటారు. కానీ శర్వా మాత్రం కామ్‌గా ఉన్నాడు. ఈ సినిమాపై వచ్చిన విమర్శల్ని స్వీకరించాడు. ‘రెండో సగం ఇంకాస్త బాగుండాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడక్కడ కొన్ని తప్పలు జరిగాయి. ఇక ముందు మరింత మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తా’ అని మాటిచ్చాడు శర్వా. ఇద్దరి హీరోల సినిమాలూ పోటీ పోటీగా విడుదలయ్యాయి. ఫలితాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. అయినా సరే… రివ్యూల్ని గౌరవించి, లోపాలు సరిద్దిద్దుకుంటాం అని.. సక్సెస్ మీట్లోనే చెప్పిన ఈ యువ కథానాయకుల గట్స్‌ని మెచ్చుకోకుండా ఉండగలమా?