బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగమోహన్ దాల్మియా మరణించడంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారనే దానిపై అందరిలో ఉత్కంట నెలకొని ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమయిన ఆ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. కానీ చివరికి అది దానిపై ఏ మాత్రం ఆసక్తి చూపని బి.సి.సి.ఐ. మాజీ అధ్యక్షుడు శశాంక్ వెంకటేష్ మనోహర్ కి దక్కింది. బి.సి.సి.ఐ. బోర్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆయనకు మద్దతు తెలిపారని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. వచ్చేనెల 4వ తేదీన ముంబాయిలో బి.సి.సి.ఐ. బోర్డు సభ్యులు సమావేశమయ్యి ఆయనను అధ్యక్షుడుగా ఎన్నుకొంటారు. శశాంక్ మనోహర్ వృత్తి రీత్యా లాయర్. ప్రస్తుతం నాగపూర్ లో పనిచేస్తున్నారు. ఆయన ఇదివరకు 2008-11మధ్య కాలంలో బి.సి.సి.ఐ. అధ్యక్షుడుగా పనిచేశారు. ఆయన చాలా నిజాయితీపరుడు, సూటిగా మాట్లాడే వ్యక్తి. వివాదస్పద నిర్ణయాలకి, అవినీతికి ఆమడ దూరంలో ఉంటారని ప్రసిద్ది. ఇంతవరకు బి.సి.సి.ఐ.కి అధ్యక్షత వహించిన వారిలో ఆయన ఒక అత్యుత్తమ అధ్యక్షుడని అందరూ అభిప్రాయపాడుతారు. అందుకే ఆయనకే ఆ పదవికి అన్ని విధాల యోగ్యుడని బి.సి.సి.ఐ. బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నారు.