భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న శశాంక్ మనోహర్ తన పదవికి రాజీనామా చేసారు. దానితో బాటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్లో బీసీసీఐ ప్రతినిధిగా కూడా తప్పుకొంటున్నట్లు ఈరోజు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కి పంపిన తన రాజీనామా లేఖలో తెలిపారు. ఆయనకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో ఇండిపెండెంట్ చైర్మన్ పదవి చేపట్టేందుకు అవకాశాలున్నందునే తన పదవికి రాజీనామా చేస్తున్నారు.
ఇంతకు ముందు బీసీసీఐ అధ్యక్షుడుగా ఉన్న జగ్మోహన్ దాల్మియా గత ఏడాది సెప్టెంబర్ లో అనారోగ్యంతో మరణించిన తరువాత శశాంక్ మనోహర్ ఆ పదవిని చేపట్టారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తుండటంతో మళ్ళీ బీసీసీఐ అధ్యక్షుడుగా ఎవరు నియమితులవుతారనే ఊహాగానాలు మొదలయిపోయాయి. ప్రస్తుతం బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న అనురాగ్ ఠాకూర్, ఐ.పి.ఎల్. చైర్మన్ రాజీవ్ శుక్లా, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ షిర్కే పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే బీసీసీఐ బోర్డు సర్వసభ్య సమావేశం నిర్వహించి, కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది.