హైదరాబాద్: పార్టీలోని అంతర్గత వ్యవహారాలను మీడియాకు లీక్ చేస్తున్నందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధి చేత మొన్న చీవాట్లు తిన్న కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌కు ప్రధాని నరేంద్ర మోడి వలన కొంత సాంత్వన చేకూరింది. మోడి నిన్న పార్లమెంట్ నిండు సభలో శశి థరూర్‌పై ప్రశంశల వర్షం కురిపించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సటీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమలో, గతంలోని వలస దేశాలన్నింటికీ బ్రిటన్ రుణపడిఉందంటూ థరూర్ ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగం గురించి ప్రస్తావిస్తూ మోడి ఈ ప్రశంశలు చేశారు(థరూర్ ప్రసంగం వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది). శశి థరూర్ ప్రసంగం ప్రతి భారతీయుడి మనస్సులోని భావాలను ప్రతిఫలిస్తోందని మోడి అన్నారు. ముందు సీట్లో కూర్చుని ఉన్నథరూర్ ఈ ప్రశంశలకు చిరునవ్వులతో స్పందించారు.
ఇక ఇది జరగటానికి ముందురోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఇటీవల బయటపడిన బీజేపీ కుంభకోణాల నేపథ్యంలో పార్లమెంట్‌ను ఎలా స్తంభింపజేయాలనేదానిపై చర్చ జరుగుతుండగా శశి థరూర్ హైకమాండ్ అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడారు. దీనిపై సోనియా కస్సుమన్నారు. ఏం మాట్లాడొద్దు కూర్చోవాలని ఖరాఖండిగా చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాలన్నింటినీ మీడియాకు లీక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థరూర్ వివరణ ఇవ్వాలని చూసినప్పటికీ సోనియా మాట్లాడనివ్వలేదు.
మరోవైపు, మోడి ప్రశంశలను పెద్దదిగా చేసి చూడొద్దని థరూర్ అన్నారు. తనేమీ బీజేపీలో చేరబోవటంలేదని చెప్పారు. తనను ప్రశంశించిన మోడికి ట్వట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనియా తనను తిట్టినట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. అదంతా మీడియా సృష్టని అన్నారు. థరూర్ ఇంతకుముందు మోడిని ప్రశంశించటంపైనకూడా వివాదం రేగిన విషయం తెలిసిందే.