ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమాగా శతమానం భవతి పేరు తెచ్చుకొంది. `గొప్ప` సినిమా కాకపోయినా…. సంక్రాంతి పండగ వాతావరణానికి సూటబుల్ అయిన సినిమా ఇది. అందుకే మంచి వసూళ్లూ అందుతున్నాయి. నిజానికి ఈ చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న మార్క్.. ఫుల్ కామెడీ. ఆయన వినోదాత్మక, మాస్ చిత్రాలకు పని చేశారు. ఆయన్నుంచి ఫ్యామిలీ కథ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇది వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన దొంగలబండి, రామదండు రెండూ వినోదాత్మక కథలే. నిజానికి శతమానం భవతి సినిమా ఐడియా ఇప్పటిది కాదట. దీని వెనుక ఓ షార్ట్ స్టోరీ ఉంది.
ఎప్పుడో పదిహేనేళ్ల క్రిందట ఊరి పయనమెటు అనే ఓ షార్ట్ స్టోరీ రాశారు సతీష్. దాన్ని ఓ ప్రముఖ పత్రికకు పంపించారు కూడా. అయితే ఆ కథని పత్రిక వాళ్లు తిప్పి పంపించారు. ఆరోజే ఆ కథ డస్ట్ బిన్‌లోకి వెళ్లిపోవాల్సింది. కానీ… కథపై నమ్మకం చావలేదు. కబడ్డీ కబడ్డీ సినిమాకి మాటల రచయితగా పనిచేస్తున్నప్పుడు అదే కథని జగపతిబాబుకి వినిపించాడు సతీష్. `కథ బాగుంది.. కానీ సినిమాగా పనికిరాదు. షార్ట్ ఫిల్మ్ అయితే బాగుంటుంది` అని సలహా ఇచ్చారు. కనీసం అది కూడా వర్కవుట్ కాలేదు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాకి పనిచేస్తున్నప్పుడు సతీష్‌కి దిల్‌రాజుతో అనుబంధం ఏర్పడింది. ఆ సందర్భంలోనే తన దగ్గరున్న కథ గురించి చెప్పాడు సతీష్. వినగానే దిల్‌రాజుకి బాగా నచ్చేసిందట. మరుసటి రోజే.. ఈ కథని లాక్ చేసేశారు. అప్పుడు సతీష్ దగ్గరున్నది రెండు పేజీల కథ మాత్రమే. దాన్ని సినిమాకి సరిపడ స్క్రిప్టుగా తయారు చేయగలిగారు వీరిద్దరూ. ఇప్పుడు అదే కథ సంక్రాంతి సినిమాగా సందడి చేస్తోంది.