పదేళ్ళు ప్రధానమంత్రి కుర్చీని రిజర్వు చేసి అట్టేబెట్టినా దానిలో కూర్చోనేందుకు దైర్యం చేయలేని రాహుల్ గాంధీ ఏమిటి.. రైజింగ్ స్టార్ ఏమిటి?అని ఎవరయినా నవ్వుకోవచ్చుగాక కానీ బీజేపీలో అసమ్మతి రాగాలు తీస్తున్న శత్రుఘన్ సిన్హా మాత్రం అలాగ అనుకోవడం లేదు. రాహుల్ గాంధీ రైజింగ్ స్టార్ అనే చెపుతున్నారు. అంటే రాహుల్ గాంధీకి మంచి ఉజ్వల భవిష్యత్ ఉందని ఆయన జోస్యం చెపుతున్నారనుకోవలేమో?
బిహార్ ఎన్నికలలో ఓడిపోయినందుకు మోడీ, అమిత్ షా అండ్ కో సంతాపం పాటిస్తుంటే, అద్వానీ అండ్ అసమ్మతి కో గ్రూపు సభ్యుడయిన శత్రుఘన్ సిన్హా, తమ పార్టీ పరాజయాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. నిన్న పాట్నాలో జరిగిన నితీష్, లాలు అండ్ సన్స్ పట్టాభిషేకాన్ని కనులారా తిలకించలేకపోయినందుకు కొంచెం బాధపడుతూనే, తన ఆప్త మిత్రులయిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, రాహుల్ గాంధీలు ముగ్గురికి ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వారి విజయం ప్రజాస్వామ్యం యొక్క విజయం అని అభివర్ణించారు. వారి ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
గత రెండు నెలలుగా మోడీ, అమిత్ షా తదితరులు బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు, లాలూ-నితీష్-కాంగ్రెస్ లను గెలిపిస్తే బిహార్ లో మళ్ళీ ‘ఆటవిక రాజ్యం’ వస్తుందని పదేపదే హెచ్చరించారు. కానీ బీజేపీలో అత్యంత సీనియర్ నేత అయిన శత్రుఘన్ సిన్హా వారిది ప్రజాస్వామ్య విజయమని, వారు ముగ్గురూ కలిసి పదికాలాలపాటు చల్లగా రాజ్యం చేసుకోవాలని కోరుకొంటున్నారు!
నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినవారిలో శత్రుఘన్ సిన్హా కూడా ఒకరు. ఆ కారణంగానే పార్టీలో అద్వానీ వంటి సీనియర్ నేతలతో బాటు ఆయనను కూడా మోడీ పక్కనపెట్టేశారు. ఆ అసంతృప్తినే ఇలాగ ట్వీట్స్ రూపంలో వ్యక్తం చేస్తూ సంతృప్తి పడుతుంటారు. కాకపోతే రాహుల్ గాంధీని రైజింగ్ స్టార్ అనడమే కొంచెం కామెడీగా ఉంది.
గత 12 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో.. ప్రత్యక్ష రాజకీయాలలోనే రాహుల్ గాంధీ ఉన్నప్పటికీ, ఆయనను దేశప్రజలే కాదు కనీసం కాంగ్రెస్ పార్టీలో వారు కూడా భారత ప్రధానిగా, చివరికి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటుగా కూడా అంగీకరించలేకపొతున్నారు. కానీ ఎప్పుడో ఓసారి కనబడే ప్రియాంకా గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవి చేపట్టడానికి అన్నివిధాల అర్హురాలని చాలా మంది ప్రజలు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు సైతం అనుకోవడం విశేషం. బహుశః ఏదో ఒకరోజు సోనియా గాంధీ ఆమెకే పార్టీ పగ్గాలు అప్పజెప్పినా ఆశ్చర్యం లేదు. మరి రాహుల్ గాంధీని శత్రుఘన్ సిన్హా రైజింగ్ స్టార్ ఎలాగనుకొన్నారో ఆయనకే తెలియాలి.