హైదరాబాద్: హాలీవుడ్ థ్రిల్లర్‌ను మరిపించే విధంగా రోజుకో మలుపు తిరుగుతున్న షీనా బోరా హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసులో రోజుకో రకంగా కొత్త కొత్త కోణాలు, కొత్త కొత్త పాత్రలు వెలుగు చూస్తుండటం, ఈ కేసు విస్తృతి దృష్ట్యా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉంటుందని బయటకు కనిపిస్తున్నా, అసలు కారణం వేరొకటని తెలుస్తోంది. ఈ కేసును పర్యవేక్షిస్తున్న ముంబాయి పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాను కొద్ది రోజులక్రితం ఉన్నట్లుండి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ బదిలీ వెనక ఒక బీజేపీ ఎంపీ హస్తం ఉన్నట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు రాకేష్ స్థానంలో వచ్చిన అహ్మద్ జావేద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి, ఆమె భర్త పీటర్ ముఖర్జియా తనకు పార్టీ సర్కిల్స్‌లో పరిచయమేనని, గత ఏడాది ఈద్ పార్టీకి వారిని ఆహ్వానించానని చెప్పటం సంచలనం సృష్టించింది. ఒకవైపు రాకేష్ మారియా బదిలీపైనే విమర్శలు ఎదుర్కొంటుండగా, కొత్త కమిషనర్ అహ్మద్ వ్యాఖ్యలతో పరువు మరింత పోతోందని గ్రహించిన మహారాష్ట్ర ప్రభుత్వం, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే బయటకుమాత్రం, ఇది సాధారణమైన హత్యకేసుమాత్రమే కాదని, దీనివెనక ఆర్థిక లావాదేవీలుకూడా ఉన్నాయని ప్రాధమిక దర్యాప్తులో తేలినందునే సీబీఐకి అప్పగిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ కేపీ బక్షి నిన్న మీడియాతో చెప్పారు. ఏది ఏమైనా కేసు సీబీఐకు చేరటం ఈ మొత్తం వ్యవహారంలో ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు.