రాజకీయ నేతలకి, సినిమా హీరోలకి ఎంత వయసొచ్చినా రిటైర్మెంట్ ఉండదని కరుణానిధి, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటివారు నిరూపిస్తునే ఉన్నారు. అదే మళ్ళీ మరోమారు నిరూపించడానికి సిద్దం అవుతున్నారు 78 ఏళ్ళు వయసున్న షీలా దీక్షిత్. డిల్లీ మాజీ ముఖ్యమంత్రిగ ఏకధాటిగా 15 ఏళ్ళు పరిపాలించిన ఆమె వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేయడానికి ‘సై’ అంటున్నారు.
“రాజకీయాలలో రిటైర్మెంట్ ఎప్పుడూ ఉండదు. నేను ఉత్తర ప్రదేశ్ కోడలిని. కనుక ఆ రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడానికి నాకేమీ భయం, సంకోచం లేదు. నేను అందుకు సిద్దంగా ఉన్నాను. ఎన్నికలు దగ్గర పడుతున్నందున సమయం చాలా తక్కువగా ఉంది. పార్టీ ఎటువంటి బాధ్యత అప్పగించినా స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను,” అని చెప్పారు.
అంత వయసులో ఉన్న ఆమె తనని తాను బామ్మగారు అని చెప్పుకొని ఉండాలి. కానీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అవకాశం దక్కించుకోవడం కోసం ఆమె తను ఉత్తరప్రదేశ్ కోడలినని చెప్పుకొంటున్నారు. అంత వయసులో కూడా ఆమె పదవులు అధికారం కావాలని తాపత్రయపడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమెకి ఆ ఆశ కల్పించింది కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు సీకరించిన ప్రశాంత్ కిషోర్.
ఆమె బ్రాహ్మణ కులానికి చెందినవారయి ఉండటం, డిల్లీ ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పరిపాలనానుభావం ఉన్న కారణంగా ఆమెని ముఖ్యమంత్రిగా అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచి యూపిలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పార్టీ అధిష్టానానికి సలహా ఇచ్చారు.
అయన సలహాని పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఆమె వయసు, ఆమె హయంలో జరిగిన రూ.400 కోట్ల నీళ్ళ ట్యాంకర్ల కుంభకోణంపై ఇటీవల ఎసిబి అధికారులు ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేయడం వంటివి అవరోధంగా ఉన్నాయి. కానీ ఆమె వయసు అనర్హత కాదని, అదే ఆమె ప్లస్ పాయింట్ అని ప్రశాంత్ కిషోర్ వాదిస్తున్నారు. ఆమె అయితేనే యూపిలో పార్టీ నేతలని కట్టడి చేసి విజయపథం వైపు నడిపించగలరని, ప్రజలు కూడా ఆమె వయసుని, అనుభవాన్నే చూస్తారు తప్ప రాజకీయ దురుదేశ్యంతో ఆమెపై మోపబడిన కేసులని పట్టించుకోరని వాదిస్తున్నారు. పైగా మిగిలిన పార్టీలు బిసిలు, ఎస్టీల ఓట్లపై ఆధారపడుతున్నప్పుడు అగ్రకులానికి చెందిన షీలా దీక్షిత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే రాష్ట్రంలో అగ్రకులాల ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారని వాదిస్తున్నారు.
అందుకే షీలా దీక్షిత్ కూడా తనే సరైన అభ్యర్దినని భావిస్తూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆమె అభ్యర్ధిత్వంపై ఆలోచనలు చేస్తోంది. జూలై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలైతే మళ్ళీ ఆగస్ట్ 12న అవి ముగిసేవరకు ఖాళీ ఉండదు కనుక ఈలోగానే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.