నటీనటులు: కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, ముఖేష్ రుషి, రావు రమేష్, బ్రహ్మానందం
దర్శకుడు : మల్లికార్జున
నిర్మాత: కొమరం వెంకటేష్
సంగీతం: ఎస్.ఎస్.థమన్
ఈ సంవత్సరం మొదట్లోనే పటాస్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈరోజు ‘షేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మల్లిఖార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా చేసింది. విజయలక్ష్మి పిక్చర్స్ బ్యానర్లో కొమర వెంకటేష్ నిర్మించిన ‘షేర్’ కు థమన్ మ్యూజిక్ అందించాడు. ఈరోజు థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
గౌతం (కళ్యాణ్ రామ్) హ్యాపీగా సాదాసీదాగా గడిపే జీవితం. తండ్రి రావు రమేష్ స్థాపించిన గౌతం కన్ స్ట్రక్షన్ లోజరిగే గొడవలను సరిచూస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా సిటీలో రౌడీ అయిన పప్పీకి ఎదురు నిలుస్తాడు గౌతం. పప్పీ మ్యారేజ్ ని డిస్ట్రబ్ చేసి పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లికూతురిని తీసుకెళ్తాడు.. అప్పటినుండి పప్పీ గౌతం ని టార్గెట్ చేయడం.. గౌతం ని ప్రేమించే నందినిని పెళ్లి చేసుకోవాలని చూడటం జరుగుతాయి.. కథలో అసలు మలుపు పప్పీకి దాదాపు లింక్ ఉండటం.. దాదా కోసమే గౌతం పప్పీని టార్గెట్ చేయడం జరుగుతుంది. అసలు గౌతం దాదా మధ్య ఏం జరిగింది..? దాదాని చంపాలని గౌతం ఎందుకు చూస్తాడన్నదే అసలు కథ..
విశ్లేషణ :
సినిమా దర్శకత్వంలో పర్వాలేదనిపించినా రొటీన్ స్టోరీ కావడం అక్కడక్కడా లాజిక్కులు మిస్ అవ్వడం చేశాడు డైరక్టర్ మల్లికార్జున్. సర్వేష్ మురారి కెమెరా పనితనం బాగానే అనిపించింది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాగా కనిపించింది. అయితే సినిమాలో లాజిక్ లేకపోవడం.. రొటీన్ స్టోరీ మీదే కథ మొత్తం నడవటం వలన ఆడియెన్స్ పెద్దగా థ్రిల్ అయ్యే ఛాన్స్ లేదు. కేవలం దర్శకుడి కోసమే ఈ సినిమా తీశానని చెప్పిన కళ్యాణ్ రామ్ కష్టమే తప్పించి ఈ సినిమాలో ఇంకా చెప్పుకోదగ్గ మ్యాటర్ ఏం లేదు. సోనాల్ చౌహాన్ చాన్స్ ఉన్నంత వరకు అందాలతో అలరించింది. సినిమాలో రావు రమేష్, షియాజి షిందే లు ఉన్నా చాలా తక్కువ స్కోప్ ఉన్న పాత్రలే చేశారు. పప్పీగా నటించిన విక్రంజీత్, దాదాగా చేసిన ముఖేష్ రుషి తమ పాత్రల మేరకు న్యాయం చేయగలిగారు. ఇక బ్రహ్మానందం ఉన్నా సరే రెగ్యులర్ గా ఎప్పుడు చేసే కామెడీతోనే నవ్వించడానికి ప్రయత్నిచినా వర్క్ అవుట్ కాలేదు. కళ్యాణ్ రామ్ మాత్రమే సినిమా గురించి కష్టపడ్డట్లుగా కనిపిస్తుంది. కథ కాస్తైనా కొత్తగా ఉండుంటే బాగుండేది కాని సంవత్సరంలో వచ్చే బోలెడన్ని సినిమాల్లో షేర్ ఒకటిలా అనిపిస్తుంది. ఏమాత్రం కొత్తదనం లేని కథ.. కథనాలు ప్రేక్షకులను కాస్త విసుగు తెప్పిస్తాయి. సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ మాత్రం కొంత మేరకు సక్సెస్ అయినా ఇంకాస్త మంచి ట్యూన్స్ ఇచ్చి ఉంటే సినిమాకు హెల్ప్ అయ్యేవి. దర్శకుడిగా మల్లిఖార్జున షేర్ తన పనితనాన్ని చూపించడంలో విఫలమయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్ అందాలు, అక్కడ అక్కడ వచ్చే కామెడీ సీన్స్ , నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
కథ, కథనం, డైరక్షన్, సాంగ్స్, నవ్వు రాని కామెడీ సీన్స్
తీర్పు:
ఇయర్ మొదట్లో పటాస్ గా వచ్చి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో నందమూరి అభిమానులకు మరో పటాస్ లాంటి ఫీలింగ్ ని షేర్ చేస్తాడనుకుంటే.. కథ..కథనాల్లో పట్టులేని ఓ రొటీన్ రివెంజ్ డ్రామాతో వచ్చాడు. కాస్త టైం పాస్ కోసం వచ్చే ప్రేక్షకులు తప్పించి సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెడుతుంది. దర్శకుడు మల్లిఖార్జున్ కి మంచి హిట్ సినిమా ఇద్దామన్న కళ్యాణ్ రామ్ తపన తప్పించి సినిమాలో అసలు మ్యాటరే లేదు. మరీ బోర్ గా ఫీల్ అయ్యి ఏదో ఒక సినిమా చూద్దాం.. అనుకునే వారికి కళ్యాణ్ రామ్ యాక్షన్, సోనాల్ చౌహన్ అందాలు కనువిందు చేస్తాయి.
తెలుగు360 రేటింగ్: 2.25/5