హైదరాబాద్ హై ప్రోఫైల్ సర్కిల్లో ఎక్కువగా కనిపించే క్రాంతి దత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో పాటు పలువుర్ని వ్యాపారంలో పెట్టుబడి పేరుతో మోసం చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీజారెడ్డి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కాంతి దత్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనేక మోసాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
విశాఖకు చెందిన కాంతిదత్.. హైదరాబాద్ హై ప్రోఫైల్ సర్కిల్స్ లో పేరు ఎక్కువగా వినిపించే శిల్పారెడ్డితో కలిసి ముందుగా ఓ ఫ్యాషన్ స్టోర్ పెట్టారు. ఆ పరిచయాలను బాగా పెంచుకున్నారు. తర్వాత శిల్పారెడ్డి అతని వ్యాపారం నుంచి విడిపోయారు. తర్వాత మరో ఫ్యాషన్ స్టోర్, హోటల్ వంటివి ఏర్పాటు చేసిన కాంతి దత్ సినీ ప్రముఖులతో ప్రచారం చేయించుకున్నారు. పరిణీతి చోప్రాను తన షోరూంకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారు.
అయితే ఈ పరిచయాలు చూపించి చాలా మంది దగ్గర పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. ఎవరికీతిరిగి చెల్లించలేదు. చాలా మంది ఇలాంటి కేసుల వల్ల తమ పేరు మీడియాలో వస్తుందని ఫిర్యాదు చేయలేదు. కానీ శ్రీజారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేయడంతో కాంతి దత్ ను పోలీసులు అరెస్టు చేశారు. పరిణీతి చోప్రాను కూడా మోసం చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.