వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అందాల రాశి శిల్పా షెట్టి ముంబైలో సందడి చేసింది. సఫోలా లైఫ్ సంస్థ కార్టర్ రోడ్ లో మార్నింగ్ వాక్ ఏర్పాటు చేసింది. నగరంలోని వేలాది దంపతులు ఈ వాక్ లో పాల్గొన్నారు.బాలీవుడ్ నటి శిల్పా షెట్టిని చూడగానే ఈవెంట్ కు వచ్చిన వారు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. శిల్పాను ఉత్సాహంగా పలకరించారు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు సెల్ఫీలు దిగారు.
మహిళలు ఇంటిని, భర్తు పిల్లల ఆలనా పాలనా చూస్తూ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరని ఈ సందర్భంగా శిల్పా షెట్టి చెప్పింది. మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించింది. ముఖ్యంగా గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలని సలహా ఇచ్చింది. భార్యాభర్తలు కలిసి రోజూ ఉదయం అరగంట నడిస్తే గుండెకు మంచిదని చెప్పింది. ఇద్దరూ కలిసి వాకింగ్ చేయలేకపోతే భర్తను, పిల్లలను పంపించిన తర్వాతైనా కాసేపు మహిళలు వాకింగ్ చేయాలని సూచించింది.
యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ తో ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పొందాలని సలహా ఇచ్చింది. ఎంత బిజీగా ఉన్నా కనీస సమయం వాకింగ్ చేయడం మహిళలు మరిచిపోవద్దని మరీ మరీ చెప్పింది. 40 ఏళ్ల వయసులో టీనేజీ అమ్మాయిలా నిగనిగలాడే శిల్ప సౌందర్యాన్ని చూసి చాలా మంది సీక్రెట్ ఏమిటని అడిగారు. టెన్షన్ పడకుండా సంతోషంగా ఉండటం, యోగా, వాకింగ్ అని శిల్పా జవాబు చెప్పింది.