శ్రీ సాయిబాబావారు రోజూ మాదిరిగానే మసీదు నుంచి లెండీకి బయలుదేరుతూ, `ఇవ్వాళ కాషాయరంగు దుస్తులు తీసుకురండి, నేను కాషాయవస్త్రాలు ధరిస్తాను’ అంటూ భక్తులకు చెప్పారు. విన్నవారందరికీ ఇది చమత్కారమనిపించింది. బాబావారు అప్పటి వరకు తెల్లరంగు దుస్తులే వేసుకున్నారు. ఏనాడు కాషాయ వస్త్రాలు కావాలని కోరలేదు. `మరి ఈవేళ బాబా ఇలా ఎందుకు అన్నారబ్బా !’ ఎంతగా ఆలోచించినా ఎవ్వరికీ అంతుపట్టలేదు. బాబావారి నిగూఢ వచనాలు ఇలాగే ఉండేవి. వారిని అర్థం చేసుకోవడం ఎవ్వరివల్లా అయ్యేదికాదు. బాబావారు ఇలా ఎందుకు అడిగారో తర్వాతకానీ భక్తులకు అర్థంకాలేదు.
సాయి భక్తుడైన బాపూసాహేబు బుట్టీని కలుసుకోవాలని జ్యోతిష పండితుడు, బ్రాహ్మణుడైన ముళే అనే వ్యక్తి షిర్డీకి వచ్చాడు. ఇతను షట్ శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు. ముళే శాస్త్రి మసీదులో బాబా దర్శనానికి వచ్చి ఆయన పక్కనే కూర్చున్నాడు. జ్యోతిష పండితుడు కావడంతో బాబావారి చేతులను చూడటంమీదనే అతగాడి దృష్టంతా. అప్పుడు బాబావారు తన భక్తులకు అరటిపళ్లు పంచిపెడుతున్నారు. అందరికీ ప్రసాదం ఇస్తున్న బాబా ఈ పండితుడ్ని మాత్రం పట్టించుకోలేదు. అవతల ముళే శాస్త్రి పరిస్థితి అంతే, ఇతగాడు బాబా ఇస్తున్న అరటిపళ్లమీద కంటే, బాబావారి అరచేతులమీదనే దృష్టంతా పెట్టాడు. హస్తరేఖలు చూడాలన్నది ఇతగాడి తపన. ఇక ఉండబట్టలేక, `మీ హస్తాన్ని ఇటు ఇవ్వండి, సాముద్రికాన్ని చూస్తాను’ అనేశాడు. బాబా, ఇతగాడికి తన అరచేతిని అప్పగించలేదు. విముఖత వ్యక్తం చేస్తూ, నాలుగు అరటిపళ్ళు చేతిలో పెట్టారు. ముళే శాస్త్రి కాసేపు కూర్చుని భక్తులతో పాటుగా బసకు వెళ్లాడు. స్నానం చేసి, మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రాన్ని ఆరంభించాడు. సరిగా అప్పుడే అక్కడ లిండీకి వెళుతున్న బాబా తన భక్తులను ఉద్దేశించి కాషాయ దుస్తులు తీసుకురమ్మని ఆదేశించారు. అలా తెచ్చిన కాషాయ వస్త్రాలను కట్టుకుని మసీదుకు చేరారు.
సాయంత్రం హారతి సమయం అయింది. సన్నాయి బూరలు మ్రోగసాగాయి. బాపూ సాహేబు మసీదుకు బయలుదేరుతూ ముళే దగ్గరకు వచ్చి `మసీదుకు వస్తారా’ అని అడిగారు. అప్పుడతను మడికట్టుకుని ఉన్నాడు. అందుకే తర్వాత వస్తానని చెప్పాడు.
మసీదులో పూజలయ్యాక, హారతి మొదలైంది. అప్పుడు బాబా, `ఆ కొత్త బ్రాహ్మణుని వద్ద నుండి దక్షిణ తీసుకురండి’ అనగానే ఆ పని చేయడానికి బాపూ సాహేబు లేచివెళ్ళాడు. బసలో ముళే శాస్త్రి ఈ విషయం తెలియగానే గాబారా పడ్డాడు. ఇటు మడి, అటు బాబా నుంచి కబురు. ఏం చేయాలో తెలియలేదు. చివరకు మసీదుకు బయలుదేరడానికే నిశ్చయించుకున్నాడు. మడిలో ఉండటంతో బాగా దగ్గరదాకా వెళ్లకుండా దూరంగా నిలబడి చూస్తున్నాడు. అలా బాబాను చూస్తుంటే ఇతగాడికి బాబా స్థానంలో తన గురువుదేవులైన ఘోలప్ నాథులు కనిపించారు. వారు బ్రహ్మీభూతమై చాలాకాలమైంది. కళ్లునలుపుకుని మరీ చూశాడు. అదే రూపం. సమాధి చెందిన గురువు కళ్లెదుట కనిపించేసరికి, పరుగుపరుగునవెళ్ళి గురువు పాదాలపై వాలిపోయాడు. ముళే శాస్త్రి మొదటి నుంచి ఘోలప్ భక్తుడు. ఘోలప్ నాథులవారు ఎప్పుడూ కాషాయ దుస్తులే ధరించేవారు. అప్పటి వరకు ఉన్న అతని మడి, ఉచ్ఛ వర్ణాభిమానం తొలిగిపోయాయి. సాయి పాదాలనే తదేకంగా చూస్తూ, ఘోలప్ నాథుల నామాలు బిగ్గరగా ఉచ్ఛరించనారంభించాడు. అతని మనస్సు సంతృప్తి చెందింది. సాయిబాబానే ఇక తన గురువన్న సంగతి అవగతమైంది. బాబావారి అలౌకిక లీలను చూచి ముళేతో సహా అంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు భక్తులకు అర్థమైంది, బాబావారు కాషాయదుస్తులు ఎందుకు కట్టుకున్నారో.
అప్పటి నుంచి బాబావారు శ్వేత దుస్తులతో పాటు పర్వదినాలప్పుడు కాషాయరంగు దుస్తులు వేసుకోవడం మొదలుపెట్టారని సాయి భక్తులు చెబుతుంటారు.
(భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్ఛరితలోని 12వ అధ్యాయంలో ఈ సంఘటనకు సంబంధించిన ప్రస్తావన ఉన్నది. ఓం సాయి నమోనమః)
– కణ్వస