షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే పేరు గతంలో ఎవరూ విని ఉండరు. ప్రతీ ఊరిలో ఎలక్ట్రికల్ దుకాణాలపై ఈ పేరు ఉంటుంది కానీ.. వేల కోట్లు పెట్టుబడులు పెట్టే బడా కంపెనీ గురించి అంతకు ముందుఎవరూ వినలేదు. నిజానికి ఈ కంపెనీ కూడా అంత పెద్దది కాదు. దాదాపుగా పదకొండేళ్ల కిందట ఏర్పాటైన ఈ కంపెనీ.. ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసేది. అది కూడా అగ్రశ్రేణి కంపెనీ కాదు. ఎగుమతులు చేసేంత బడా కంపెనీ కాదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఈ కంపెనీ విశ్వరూపం చూపిస్తోంది.
కడప వాసులు… వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుల కంపెనీ !
షర్డి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన అవినాష్ రెడ్డి కుటుంబానికి, జగన్ కు అత్యంత సన్నిహితుడు. రెండు, మూడేళ్ల కిందట వరకూ ఈ కంపెనీ సాదాసీదా కంపెనీనే. ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేస్తుంది. వైసీపీ పెద్దలకు సన్నిహితం కావడంతో వేల ఎకరాల భూములు.. వేల కోట్ల పెట్టుబడుల సోలార్ పార్కులు.. సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ప్రాజెక్టులు.. స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టులు.. అంతే కాదు.. వచ్చే పది ఇరవై ఏళ్లకు అవసరమైన ట్రాన్స్ ఫార్మర్లను విద్యుత్ సంస్థలు ఆ కంపెనీ వద్ద ఉన్నవన్నీ కొనేయడం వంటివి జరుగుతున్నాయి. దీంతో ఈ కంపెనీ వెనకు పెద్ద గూడుపుఠాణి ఉందన్న వాదన వినిపిస్తోంది.
రామాయపట్నం పోర్టు దగ్గర ఐదు వేల ఎకరాలకు టెండర్ !
‘
నెల్లూరు జిల్లా రామాయపట్నంపోర్టు దగ్గర ఇండ్ సోల్ సోలార్ అనే కంపెనీకి ఐదు వేల ఎకరాల వరకూ కట్టబెట్టడానికి శరవేగంగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ భూములు ప్రభుత్వానివి కావు. రైతుల దగ్గర నుంచి బలవంతంగా సేకరించడానికి ఏర్పాట్లు చేశారు. మొదట రాయాయరపట్నంపోర్టు కోసమన్నట్లుగా చెప్పి.. ఇప్పుడు ఇండ్ సోల్ సోలార్ అని మార్చారు. ఈ కంపెనీ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ కంపెనీ. పది లక్షల అథరైజ్డ్ క్యాపిటల్‌తో ప్రారంభించి ఇంకా ఏడాది కూడా కాలేదు. అంటే… ఎలాంటి కార్యకలాపాలు లేవు. కానీ వేల కోట్లు పెట్టుబడులు పెడతారనిచెప్పి.. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి సేకరించి మరీ వేల ఎకరాలు కట్టబెట్టడానికి సిద్ధమైంది.
కడపలో సెజ్ భూములు అప్పగింత !
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు కడప నగరానికి ఆనుకుని ఉన్న విలువైన భూములను కేటాయించింది. ఈ పరిశ్రమకు కేటాయించిన భూముల చుట్టూ నివాస ప్రాంతాలే ఉన్నాయి. వాస్తవానికి అవి ఐటీ సెజ్ భూములు.కానీ డీ నోటిఫై చేసి మరీ కేటాయించారు. ఇక్కడా అతి తెలివి చూపించారు. యాభై ఎకరాలు కేటాయించాలంటే పై స్థాయి అనుమతులు తీసుకోవాలి. అందుకే 49.8 ఎకరాలను… రాష్ట్ర స్థాయికి వెళ్లకుండా జిల్లా స్థాయి అధికారులతోనే పని కేటాయించేశారు. ఈ భూముల విలువ నూట యభై కోట్లు ఉంటుంది. కానీ కోటి లోపే ఇచ్చేశారు. దీనిపై దుమారం రేగింది. అయినా పట్టించుకునేవారు లేరు.
సోమశిల వద్ద మరో ప్రాజెక్టుకు అనుమతి
సోమశిల వద్ద కూడా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సోమశిల వద్ద 900 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. ఇందు కోసం కనీసం పదిహేను వందల కోట్ల పెట్టుబడి పెడతామని ఆ సంస్థ చెబుతోంది.
ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చట్టాలకు వ్యతిరేకంగా ప్రాజెక్టులు !
ఇటీవల అల్లూరి సీతారామరాజుజిల్లా ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును షిరిడి సాయి సంస్థకు ప్రభుత్వం నామినేషన్ కేటాయించింది. దీనిపై గిరిజనులు పెద్ద ఎత్తునఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో జనవనరుల్ని ఆ సంస్థకు కేటాయించింది. ఇది చట్ట విరుద్ధమని తీవర ఆరోపణలువస్తున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.
అదానీతో పోటీగా సంప్రదాయేతర విద్యుత్ ఒప్పందాలు !
ఏపీ ప్రభుత్వం ఇటీవల సంప్రదాయేతర విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకుంది. గత ప్రభుత్వం పాతికేళ్లకు ఒప్పందాలు చేసుకుందని..అది అవినీతి ఆని ఆరోపించిన జగన్.. అధికారంలోకి వచ్చాక… ముఫ్పై ఏళ్ల పరిమితితో కొత్త ఒప్పందాలు చేసుకున్నారు. ఇలాంటి వాటిలో అదానీతో పాటు… షిరిడి సాయి సంస్థ కూడా ఉంది.
స్మార్ట్ మీటర్లు కూడా షిరిడి సాయి ఖాతాలోనే !
ఏపీలో ఇటీవలి కాలంలో తీవ్ర వివాదాస్పదమైన అంశం స్మార్ట్ మీటర్లు, ఇళ్లకు.. వ్యవసాయ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే కాంట్రాక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీన్ని కూడా ఎలాగైనా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కట్టబెట్టాలనే ఆలోచనతోనే వ్యవహారం సాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే నేరుగా ఆ కంపెనీకి లేకపోతే.. ఆ కంపెనీ బినామీకి దక్కే చాన్స్ ఉన్నాయి.
షిరిడి సాయి నుంచి విద్యుత్ సంస్థలు కొన్ని ట్రాన్స్ ఫార్మర్లు లెక్కలేనన్ని !
ఏపీ ప్రభుత్వ పనులకు భారతీ సిమెంట్ నుంచే సిమెంట్ బ్యాగులు కొంటున్నట్లుగా.. విద్యుత్ సంస్థకు తమకు అవసరమైన ట్రాన్స్ ఫార్మర్లు షిరిడి సాయి సంస్థ నుంచే కొంటున్నాయి ఎంత క్వాలిటీ అనేది చూసుకోకుండా… ఇష్టారీతిన కొంటున్నాయి. ప్రస్తుతం పదేళ్లకు సరిపడా ట్రాన్స్ ఫార్మర్లను కొనేశారు. అవి గోడౌన్లలో పట్టకపోవడంతో.. ఓపెన్ ప్లేసుల్లో స్క్రాప్ లాగా పడేసిన దృశ్యాలు మీడియాలో హైలెట్ అయ్యాయి.
ప్రభుత్వం ఓ కంపెనీ కోసం ఇంత దారుణంగా అధికార దుర్వినియోగం చేస్తోదంటే.. ఖచ్చితంగా ఈ కంపెనీ వెనుక ఏదో లోగుట్టు ఉందని అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు బెంగళూరులో సండూర్ పవర్ అనేకంపెనీని కొన్నారు. ఆ కంపెనీ చిన్నదే.. కానీ ఆ కంపెనీ నుంచి పారిన పెట్టుబడుల వరదతో మహా సామ్రాజ్యం నిర్మించారు. ఇప్పుడు ఆ తరహాలోనే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సామ్రాజ్యం నిర్మితమవుతోంది. ఈ కంపెనీ కథేమిటో.. అధికారం పోయిన తర్వాత తేటతెల్లమయ్యే అవకాశం ఉంది.