జగన్ హయాంలో ఓ వెలుగు వెలిగిన షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ కూడా తప్పుడు బ్యాంక్ గ్యారంటీలు సమర్పించింది. ఆ సంస్థకు ఏపీ విద్యుత్ సంస్థల్ని గుత్తకు ఇచ్చేశారు. కాంట్రాక్టులు అయితే వేల కోట్లు సమర్పించుకున్నారు. నిబంధనల ప్రకారం బ్యాంకు గ్యారంటీలు సమర్పించకపోయినా పట్టించుకోలేదు. ఇప్పుడు అది అధికారుల మెడకు చుట్టుకుంటోంది. దాంతో షరిడిసాయి సంస్థ యాజమాన్యం వద్దకు పరుగులు పెడుతున్నారు.
Also Read :షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌లో ఐటీ సోదాలు – లెక్క మారిందా ?
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పొందిన కొన్ని కాంట్రాక్టుల్లో రూ. ఐదు వందల కోట్ల జాతీయ బ్యాంకుల గ్యారంటీల సమర్పించాలని షరతు ఉంది. అయితే షిరిడిసాయి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించారు. అది జాతీయ బ్యాంక్ కాదు..అసలు బ్యాంకో కాదో కూడా ఎవరికీ తెలియదు. అయినా ఆమోదించేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ గ్యారంటీల గురించి చర్చ ప్రారంభమయింది. టెండర్లకు ఆ గ్యారంటీలు ఆమోదించిన వారి మెడపై కత్తి వేలాడుతూండటంతో కొత్తగా వాటిని వెనక్కి తీసుకుని జాతీయ బ్యాంకుల గ్యారంటీలు సమర్పించాలని అడుగుతున్నారు. కానీ వారు ఇస్తారో లేదో అర్థం కావడంలేదు.
యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ బ్యాంక్ ఏపీ, తెలంగాణలోని గత ప్రభుత్వాల పెద్దలకు సన్నిహితమైన కాంట్రాక్టర్లకు మాత్రమే వేల కోట్ల విలువైన బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చింది. కమిషన్లు తీసుకుని ఇలా బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి. వెస్టిండీస్ దీవుల్లోని సెయింట్ లూసియా అనే ఊళ్లో చిన్న భవనంలో ఉండే ఈ బ్యాంక్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. విచారణ జరిపిస్తే కానీ అసలు విషయం బయటపడే అవకాశం ఉండదు.