హైదరాబాద్: ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల వివాదం అంత తేలిగ్గా సమసిపోయేటట్లు లేదు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమిర్ వివరణ ఇచ్చినప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా శివసేన పార్టీ పంజాబ్ శాఖ సంచలన ప్రకటన చేసింది. ఆమిర్‌ను చెంపదెబ్బ కొట్టినవారికి లక్ష రూపాయలు నజరానా ఇస్తామని ప్రకటించింది.
ప్రస్తుతం ‘దంగల్’ అనే సినిమా చేస్తున్న ఆమిర్ ఆ సినిమా షూటింగ్ కోసం పంజాబ్‌లోని లూథియానాలో రాడిసన్ బ్లూ హోటల్లో బసచేసి ఉన్నారు. ఇది తెలుసుకున్న శివసేన కార్యకర్తలు హోటల్ బయట నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా శివసేన స్థానిక నాయకుడు రాజీవ్ టాండన్ అక్కడే ఈ నజరానా గురించి ప్రకటన చేశారు. ఈ ఆఫర్‌ను దంగల్ చిత్ర యూనిట్ సభ్యులు, రాడిసన్ బ్లూ హోటల్ సిబ్బంది కూడా వినియోగించుకోవచ్చనికూడా చెప్పారు. ఆ చెంపదెబ్బ కొట్టినవారిని సాహసవంతులు, దేశభక్తిపరులుగా గౌరవిస్తామని అన్నారు. మరోవైపు శివసేన ఆందోళనల నేపథ్యంలో హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. షూటింగ్ సందర్భంగా కండరాలు పట్టేయటంతో ఆమిర్ వారం రోజులు విశ్రాంతి తీసుకుని ఇవాళ ఉదయమే లూథియానా చేరుకున్నారు. మొత్తంమీద, ఈ వ్యాఖ్యలు చేయకముందు దేశం వదిలివెళ్ళే పరిస్థితులు ఆమిర్‌కు లేవుగానీ, ఇప్పుడైతే మాత్రం ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి.