శివసేన, భారతీయ జనతా పార్టీ… ఆ రెండు పార్టీలూ ఒకే తానులో ముక్కలే. అయితే, గత కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చింది శివసేన. ఆ పార్టీ పత్రిక సామ్నాలో కూడా… ప్రధాని నిర్ణయాలపై తీవ్రంగా విమర్శించిన సందర్భాలున్నాయి. దీంతో, మహారాష్ట్రలో భాజపా, శివసేనల మధ్య పొత్తు కొనసాగింపు దాదాపు కష్టసాధ్యమే అన్నట్టుగా కనిపించేది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. భాజపాతో సీట్ల సర్దుబాటుకి శివసేన సిద్ధమైంది. తమవి హిందుత్వ పార్టీలనీ, పాతికేళ్లుగా పొత్తు కొనసాగుతోందనీ, లోక్ సభ ఎన్నికల్లో భాజపా 25 సీట్లు, తాము 23 సీట్లలో పోటీకి అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటున్నట్టుగా సీఎం దేవేంద్ర పడ్నవీస్ ప్రకటించారు. అయితే, భాజపా మీద తీవ్ర విమర్శలు చేసిన శివసేన ఇప్పుడు తగ్గినట్టా..? విమర్శించినవారిని కూడా తమవైపు తిప్పుకోవడంలో భాజపా నెగ్గినట్టా..?
శివసేన కూడా మతతత్వ పార్టీ కావడంతో అటు ఎన్సీపీతో కలిసే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు అనేదీ సాధ్యం కాదు. ఆ పార్టీకి పొత్తు అంటే… అది భాజపాతోనే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినా… ఎన్నికల తరువాతి పరిస్థితులు కొంత తమకు అనుకూలిస్తే, చక్రం తిప్పడానికి శివసేన సిద్ధమౌతుంది అనడంలో సందేహం లేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత… భాజపాకి బొటాబొటీ మెజారిటీ వస్తే… ప్రధాని అభ్యర్థిగా మోడీని మార్చాలనే డిమాండ్ ను శివసేన తెరమీదికి తెచ్చే ఆస్కారం కచ్చితంగా ఉంది. ఇంకోపక్క, అదే రాష్ట్రం నుంచి ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా నితిన్ గట్కరీ పేరు కూడా ఈ మధ్య తెర మీదికి వచ్చిన సందర్భం తెలిసిందే. అలాంటివారికి మద్దతు ప్రకటించే ఆలోచనా శివసేనకి లేదనీ అనలేం.
ఒకవేళ ఎన్డీయే కూటమి కంటే, భాజపా వ్యతిరేక పార్టీల కూటమికి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు స్థాయి ఫలితాలే ఎన్నికల్లో లభిస్తే… పరోక్షంగా అటువైపూ శివసేన మొగ్గుచూపే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రధాని మోడీ విషయంలో శివసేన కొంత అసంతృప్తిగా ఉందనేది వాస్తవం. కాబట్టి, ప్రస్తుతం భాజపాతో సీట్ల సర్దుబాటును, ఆ పార్టీకి శివసేన తలొంచేసిన పరిస్థితిగా విశ్లేషించుకోలేం.