కమలనాథులకు ఊహించని షాక్. బీహార్లో ఒంటరిగా బరిలోకి దిగాలని శివసేన నిర్ణయించింది. 150 సీట్లకు పోటీ చేయబోతున్నట్టు ప్రకటించింది. మహారాష్ట్రలో బీజేపీకి శివసేన మిత్రపక్షమనే సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఈ రెండింటి మధ్యా సీట్ల సర్దు బాటు ఉండదు. అందుకే ఒంటరిగానే బీహార్ ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రకటించారు. తమ బలాన్ని పరీక్షించుకోవడంతో పాటు వీలైనన్ని సీట్లు, ఓట్లు పొందడానికి శాయశక్తులా పోరాడుతామని ఆయన చెప్పారు. శివసేన అంటే ముంబైలో, మహారాష్ట్రలో బీహారీ వలస కార్మికులకు వ్యతిరేక పార్టీ అనే ముద్ర ఉంది. వారి వల్లే మరాఠాలకు ఉద్యోగాలు తగ్గుతున్నాయంటూ దాడులు చేసిన సందర్భాలున్నాయి. యూపీ, బీహారీలను రానివ్వవద్దంటూ బాహాటంగా అనేకసార్లు పిలుపునిచ్చింది. అలాంటి పార్టీకి బీహారీలు ఓటు వేస్తారా? అనేది అనుమానమే.
అయితే సంజయ్ రౌత్ వివరణ వేరేగా ఉంది. తాము బీహారీలకు వ్యతిరేకులమనేది ప్రతిపక్షాల కుట్ర అన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పనిచేసుకోవచ్చని, తాము బీహారీలకు వ్యతిరేకులం కాదని, ఎన్నికల ప్రచారంలో ఇదే సంగతి చెప్తామని వివరించారు. బీహార్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నంచీ ఇప్పటి వరకూ జేడీయూ కూటమికి షాకిచ్చే పరిణామాలే చోటుచేసుకున్నాయి. ములాయం దూరమై మూడో కూటమి పెట్టడం, ఎంఐఎం రంగంలోకి దిగడం వంటివి అధికార కూటమి ఓటు బ్యాంకును దెబ్బతీసే పరిణామాలు. ఇప్పుడు హిందూ ఓటు బ్యాంకుకు గండికొట్టేలా శివసేర రంగప్రవేశం చేసిందంటున్నారు పరిశీలకులు.
బీజేపీ ప్రస్తుతం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా హిందూత్వ భావాలు గల వారి ఓటు బ్యాంకు ఆ పార్టీ వెంటే ఉంది. ఇప్పుడు శివసేన రంగ ప్రవేశంతో అందులో చీలిక వస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, మూడు నాలుగు దశాబ్దాలుగా మహారాష్ట్రలో బీహారీలపై శివసైనికులు జులుం చేశారని, కాబట్టి వారు ఆ పార్టీకి ఓటు వెయ్యరని కమలనాథులు ధీమాగా ఉన్నారు. చివరకు ఛట్ పూజను కూడా మహారాష్ట్రలో జరగనివ్వం అంటూ శివసేన బెదిరించిన సందర్భాలున్నాయి.
ఈ కోణంలోంచి చూస్తే బీజేపీ ఓటు బ్యాంకును శివసేన చీల్చే అవకాశాలు నామమాత్రమే అంటున్నారు విశ్లేషకులు.