నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిలో మరో ప్రత్యేకత వచ్చి చేరింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి స్క్రిప్టులో శివరాజ్ కుమార్ కి ఎలాంటి పాత్రా లేదు. `మీ సినిమాలో నాక్కూడా నటించాలని ఉంది.. చిన్న పాత్ర అయినా ఫర్వాలేదు` అని శివరాజ్ కుమార్ బాలయ్యని అడగడంతో… గౌతమి పుత్రలో శివరాజ్‌కి స్థానం దక్కింది. కేవలం శివరాజ్‌కుమార్ కోరికమేరకే.. ఆయన కోసం ఓ పాత్ర సృష్టించారు క్రిష్. అది.. గౌతమి పుత్ర శాతకర్ణి ముని మనవడిగా.
గౌతమిపుత్ర శాతకర్ణి ముని మనవడి పేరు కూడా శాతకర్ణినే. సినిమా ప్రారంభంలోనే రాజ్ కుమార్ కనిపిస్తాడని, అతనికి ఓరాజు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలెట్టడంతో ఈ కథ మొదలవుతుందని తెలుస్తోంది. మళ్లీ చివర్లో.. శివరాజ్‌కుమార్ కనిపిస్తాడట. బాలయ్య, శివరాజ్ కుమార్ కాంబినేషన్లోనూ కొన్ని సన్నివేశాలు ఉంటాయట. మరి వాటిని ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. రెండు పాటలు, శివరాజ్‌కుమార్ సన్నివేశాలు మినహా గౌతమి పుత్ర షూటింగ్ పూర్తయినట్టే. శివరాజ్ కుమార్ రాక.. గౌతమి పుత్రకు అదనపు ఆకర్షణే. కర్నాటకలో బాలయ్య సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ దఫా… ఆ డిమాండ్ రెట్టింపు అవ్వడం ఖాయం. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది క్రిష్ బృందం.