కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠం వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు శివస్వామి అనే పెద్దమనిషి. ఆ మఠం పెద్ద చనిపోవడంతో వారసత్వం కోసం ఆయన ఇద్దరి భార్యల కుమారులుపోటీ పడుతున్నారు. ఈ పంచాయతీని తేలుస్తానంటూ.. కొంత మంది ఇతరుల్ని పీఠాధిపతుల పేరుతో తీసుకెళ్లిన శివస్వామి అక్కడ మమూలుగా రచ్చ చేయడం లేదు. ఆయన పూర్తిగా … చనిపోయిన మఠం పెద్ద వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్ద భార్య వైపు మాట్లాడుతున్నారు. ఆయన కుమారుడే అర్హుడని తేల్చి చెబుతున్నారు. అయితే.. ఆయనకేం అధికారం ఉందని అలా ప్రకటిస్తున్నారన్న చర్చ ప్రారంభమయింది.
ఈ లోపు వారసత్వం తమకే దక్కేలా వీలునామా ఉందంటూ… వాదిస్తున్న చనిపోయిన మఠం పెద్ద చిన్న భార్య .. శివస్వామిపై తీవ్రమైన ఆరోపణుల చేస్తున్నారు. రూ. యాభై లక్షలు లంచం తీసుకుని ఆయన తమపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంకటాద్రిస్వామికి పీఠం కట్టబెట్టేందుకు పీఠాధిపతులు రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసిందని.. చర్చలకు పిలిచి శివస్వామి అవమానించారని శివస్వామిపై చర్యలకు చట్టపరంగా ముందుకెళ్తామని ప్రకటించారు. ఆమె శివస్వామి మాట్లాడిన ఓ ఆడియోటేపును డీజీపీకి ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఈ కోపం.. శివస్వామికి ఎక్కువగానే ఉంది. ఆయన .. మఠంలో వ్యవహారాలపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మరణంపై అనుమానాలున్నాయని ప్రకటనలు చేస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడిలా.. మఠంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఆయన అక్కడే తిష్ట వేసి.. ఓ వర్గానికి అనుకూలంగా చేస్తున్న వ్యవహారంతో కలకలం బయలుదేరింది. ప్రభుత్వం కూడా శివస్వామి ప్రకటనలతో ఎలాంటి సంబంధం లేదని అంటోంది కానీ చోద్యం చూస్తోంది. మొత్తానికి శివస్వామి అనే వ్యక్తి.. అమరావతి ప్రాంతంలో గతంలో వివాదాస్పద ప్రకటనలు చేసేవారు.. ఇప్పుడు కడప జిల్లాలో మఠం వ్యవహారాల్లో మధ్యవర్తి పాత్ర పోషిస్తూ.. వివాదాస్పదం అవుతున్నారు.