నటుడు శివాజీ ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలుపెట్టి బీజేపీకి దూరం అయిన సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఆయనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసారు కానీ దానికి ప్రజల నుండి, రాజకీయ పార్టీల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో ఆయన పోరాటం విఫలమయింది. ఆ తరువాత ఆయన ఆ ఊసే ఎత్తలేదు. మళ్ళీ ఇప్పుడు దాని కోసం ఉద్యమం మొదలుపెడతానని చెప్పారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
రాష్ట్ర బీజేపీ నేతలను ఎవరినీ నమ్మలేమని కనుక వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా వ్యవహరించాలని శివాజీ హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రి (వెంకయ్య నాయుడు?) ట్రస్టుల పేరుతో కోట్ల రూపాయలు పోగేసుకొంటున్నారని, అవసరమయితే ఆ మంత్రి అక్రమ సంపాదనపై న్యాయపోరాటం చేయడానికి కూడా తాను వెనుకాడనని చెప్పారు. ఆ మంత్రికి చాలా అధికారం, పలుకుబడి ఉన్నందున తను న్యాయస్థానంలో గెలవలేకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆ మంత్రి అవినీతి గురించి ప్రచారం చేస్తానని అన్నారు.
జగన్ అక్రమర్జన గురించి ప్రశ్నిస్తునప్పుడు ఈ కేంద్రమంత్రి అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించకూడదని అడిగారు. ఆయన ఒక్కరే కాదు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అందరూ ఏవిధంగా అవినీతికి పాల్పడుతున్నారో తనకు తెలుసునని అందరి బండారాలు బయటపెడతానని శివాజీ హెచ్చరించారు. తాను బెదిరింపులకి భయపడే వ్యక్తిని కానని, ఎవరితోనయినా పోరాడే దైర్యం తనకు ఉందని చెప్పారు.
శివాజీ బీజేపీలో ఉన్నప్పుడు తన పార్టీకి ఇబ్బంది కలిగించే ప్రత్యేక హోదా అంశంపై పోరాడాలనుకోవడం రాజకీయ సూత్రాలకి సూట్ అవదు. కనుక ఆ కారణంగా ఆయనకి పార్టీ రాష్ట్ర నేతల నుండి చేదు అనుభవాలు ఎదురయి ఉండవచ్చును. బహుశః ఆ కారణంగానే శివాజీ రాష్ట్ర బీజేపీ నేతలపట్ల వ్యతిరేకత కనబరుస్తున్నారని అనుకోవలసి ఉంటుంది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినపుడు ఆయన వామపక్షాలతో కలిసి పని చేసారు కనుక బహుశః వాటి ప్రభావం ఆయనపై పడి ఉండవచ్చును. అందుకే కేంద్రమంత్రులతో కయ్యానికి సిద్దమని సవాలు విసురుతున్నారేమో?
అయితే ఆయన కేంద్ర మంత్రుల అవినీతికి వ్యతిరేకిస్తూ వారితో పోరాడాలనుకొంటున్నారా లేక ప్రత్యేక హోదా కోసం వారు శ్రద్ధ చూపకపోవడం వలననే వారితో పోరాడాలనుకొంటున్నారా లేక ఆ రెండింటి వలన పోరాడాలనుకొంటున్నారో తెలియదు. కానీ మళ్ళీ పోరాటం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు మాత్రం అర్ధమవుతోంది. జగన్మోహన్ రెడ్డి వంటి హేమాహేమీలే ప్రత్యేక హోదాపై పోరాడలేక చేతులు ఎత్తేసినప్పుడు, ఒకసారి పోరాడి విఫలమయిన శివాజీ మళ్ళీ దాని కోసం ఎందుకు పోరాడాలనుకొంటున్నారో? అయినా ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితులలో కూడా ఇవ్వలేమని, ఇచ్చే ఉద్దేశ్యం కూడా లేదని కేంద్రప్రభుత్వం కుండబ్రద్దలు కొట్టినట్లు చెపుతుంటే, శివాజీ దానిని ఏవిధంగా సాధించగలనని అనుకొంటున్నారో?