Shivam Bhaje Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ 2.25/5
కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాడు అశ్విన్ బాబు. ఆయన గత చిత్రం హిడింబిలో అంతరించుకుపోయిన ఓ తెగ కథని థ్రిల్లర్ గా చెప్పాడు. ఇప్పుడు ఆయన నుంచి ‘శివం భజే’ సినిమా వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని రేపింది. ఇది కూడా కాన్సెప్ట్ సినిమానే. జెనోట్రాన్స్ప్లాంటేషన్ పాయింట్ ఆధారంగా రాసుకున్న మెడికల్ థ్రిల్లర్ ఇది. మరి ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులని అలరించేలా ఉందా? ఇందులో వుండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాయా?
చైనా, పాకిస్థాన్ కలసి భారత్ లో భారీ విద్వంసం చేయడానికి ఓ కుట్ర చేస్తాయి. ఈ ఆపరేషన్ పేరు ‘లామా’. కట్ చేస్తే.. హైదరాబాద్ వేదికగా నడుస్తున్న ఓ ఫార్మాసీ కంపెనీలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు హత్యకు గురవుతారు. కట్ చేస్తే.. చంద్రశేఖర్ అలియాస్ (అశ్విన్ బాబు) ఓ మామూలు కుర్రాడు. ఈఎంఐలో ఎగ్గొట్టేవారి వెంటపడి డబ్బులు కట్టించడం అతని వృత్తి. అనుకోని ఓ సంఘటన కారణంగా తన చూపుపోతుంది. సరైన సమయానికి నేత్రదాత దొరకడంతో ఆపరేషన్ జరిగి మళ్ళీ చూపు వస్తుంది. కొత్తగా చూపు వచ్చిన చందుకి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఏవో శబ్ధాలు, కలలు వస్తుంటాయి. దీంతో డాక్టర్ ని సంప్రదిస్తాడు. అక్కడ తన కళ్ళ గురించి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. ఏమిటా నిజం ? ఆపరేషన్ లామాకి, వరుస హత్యలకు, చందుకి వున్న లింక్ ఏమిటి ? చైనా, పాక్ కుట్ర ఫలించిందా? ఈ కథలో శివుడి పాత్ర ఏమిటి ? ఇవన్నీ తెరపై చూడాలి ?
కొన్ని కాన్సెప్ట్ లు వినడానికి భలే వింటాయి. విన్న వెంటనే సినిమా తీసేద్దామనే ఉత్సాహాన్ని ఇస్తాయి. అయితే కేవలం కాన్సెప్ట్ బావుంటేసరిపోదు. అది కథలో ఫిట్ చేయగలగాలి. శివం భజేలో జెనోట్రాన్స్ప్లాంటేషన్ (రెండు భిన్న జాతుల మధ్య అవయవాల మార్పిడి) కాన్సెప్ట్ వుంది. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో సినిమాలు పెద్దగా రాలేదనే చెప్పాలి. కానీ ఈ కాన్సెప్ట్ తెరపై చూపించే ప్రయత్నం అంత థ్రిల్లింగ్ అనుభూతిని పంచలేకపోయింది.
చైనా, పాకిస్తాన్ కుట్రతో కథ మొదలౌతుంది. తర్వాత వరుస హత్యలు తెరపైకి వస్తాయి. ఇక్కడే పరమ శివుడుని చూపిస్తూ ఒక డివైన్ టచ్ ఇచ్చారు. హీరో పాత్రని పరిచయం చేసిన తీరు చూశాక.. అసలు ఇలాంటి సెటప్ తో ఎలాంటి కథ చూపిస్తారో అనే ఆసక్తి అయితే కలుగుతుంది. కానీ ఎక్కడిగొంగళి అక్కడే అన్నట్టుగా విరామఘట్టం వరకూ ఈ కథలో పెద్ద మలులుపు వుండవు. డైరెక్టర్ దగ్గర ఒక ట్విస్ట్ వుంది. అదొక్కటే ఇంటర్వెల్ వరకూ సరిపొతుందనుకున్నారేమో కానీ పరుగులు పెట్టాల్సిన కథ ఏవో సాదాసీదా సన్నివేశాలతో ఎలాంటి థ్రిల్స్ లేకుండానే మెల్లగా కదులుతుంటుంది.
హీరోకి కంటి ఆపరేషన్ తర్వాత నిజానికి కథ వేగం పుంజుకోవాలి. కానీ అలా జరగలేదు. ఇందులో కాన్సెప్ట్ రివిల్ చేయాడానికే ఇంటర్వెల్ వరకూ లాగేశారు. జెనోట్రాన్స్ప్లాంటేషన్ ని రివిల్ చేసిన తీరు మాత్రం సెకండ్ హాఫ్ లో ఆసక్తిని పెంచేలానే వుంటుంది. జెనోట్రాన్స్ప్లాంటేషన్ డిటేయిలింగ్ తో సెకండ్ హాఫ్ మొదలౌతుంది. ‘డోగ్రా’ నేపధ్యం ఆసక్తికరంగా వుంటుంది. అయితే ఈ కథలో విలనీ ఎలిమెంట్ బలహీనంగా వుంటుంది. అలాగే హీరో టార్గెట్ లో కూడా క్లారిటీ వుండదు. నిజానికి మంచి నేరపరిశోధన చిత్రంగా మలిచే అవకాశం వున్న కాన్సెప్ట్ ఇది. అయితే దర్శకుడు వేసుకున్న సెటప్ దానికి పెద్ద స్కోప్ ఇవ్వలేదు. హీరో ఫీలింగ్, ఎమోషన్స్ తో ఆడియన్ ఎంపతైజ్ చేయడంలో డైరెక్టర్ ఇంకా వర్క్ చేయాల్సింది. హీరో కనెక్ట్ చేసుకునే డాట్స్, క్లూస్ అంత ఎక్సయిటింగా ఉండవు. చివర్లో వాడుకన్న డివైన్ ఎలిమెంట్, కాంతార స్టయిల్ హెవీ క్లైమాక్స్ ఆకట్టుకునేలానే తీశారు.
యాక్షన్ పాత్రలకు అశ్విన్ బాబు సరిపోతాడు. ఇందులో తనకి మరోసారి భారీ ఫైట్లు చేసే ఛాన్స్ వచ్చింది. క్లైమాక్స్ ఫైట్ వీర లెవల్ లో చేశాడు. హీరోయిన్ చేసిన సూర్యవంశీ పాత్రని కూడా కథలో బాగం చేయడం బావుంది. తను పద్దతిగా కనిపించింది. అర్బాజ్ ఖాన్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. హైపర్ ఆది పంచులు అక్కడక్కడా పేలాయి. మురళి శర్మ, తనికెళ్ళ, భరణి, బ్రహ్మజీ, అయ్యప్ప కథ మేరకు కనిపించారు.
వికాస్ నేపధ్యం సంగీతం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా చోట్ల బీజీఎం తోనే థ్రిల్ పంచాడు. కెమెరా పనితనం డీసెంట్ గానే వుంది. చాలా చోట్ల సోషల్ మీడియా మీములు, డబుల్ మీనింగ్ డైలాగులు వినిపిస్తాయి. అవి ఎవైడ్ చేస్తే బావుండేది.
ముందే చెప్పుకున్నట్లు కాన్సెప్ట్ ని కథలో ఎంత ఆసక్తికరంగా మిళితం చేస్తున్నామనే పాయింట్ మీద సినిమా ఆధారపడివుంటుంది. శివంభజే కథ విషయానికి వస్తే.. దీనికి ఉగ్రవాదం, మెడికల్ క్రైమ్ టచ్ ఇచ్చారు. ఈ రెండు కూడా లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్. వీటిని డీల్ చేసే తీరు కూడా అంతే గ్రాండ్ స్కేల్ లో ఉన్నప్పుడే కథలో ప్రేక్షకులు లీనం అవుతారు. ఇందులో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. ఆర్కెస్ట్రా ఒక ఒక శ్రుతిలో వాయిస్తుంటే సింగర్ మరో శ్రుతిలో పాడినట్లు ..ఇందులో కాన్సెప్ట్, కథ దేనికవే అన్నట్టుగా కనిపిస్తాయి. మొత్తానికి కాన్సెప్ట్ లో వున్న బలం.. ప్రజంటేషన్ లోకి వచ్చేసరికి తేలిపోయింది.
తెలుగు360 రేటింగ్ 2.25/5