కరోనా వల్ల బీభత్సాలు జరిగిపోయాయి. చరిత్రలో కని వినీ ఎరుగని గుణపాఠం.. కరోనా. అయితే.. కొన్ని సినిమాలకు కరోనానే కథా వస్తువు అయ్యింది. ఈనెల 27న విడుదల కానున్న `వివాహ భోజనంబు` లాక్ డౌన్ లో జరిగిన పెళ్లి కథ. మారుతి దర్శకత్వంలో రూపొందిన `మంచి రోజులు వచ్చాయి` కూడా కరోనా కథే. ఇప్పుడు గుహన్ దర్శకత్వంలో రూపొందిన `WWW` కూడా కరోనా కథే అని తేలిపోయింది. కరోనా తరవాత సమాజంలో వచ్చిన మార్పు, మనుషుల మధ్య దూరం, వర్చువల్ వరల్డ్ కి పెరిగిన ప్రాధాన్యం ఇవన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నార్ట. అదిత్ హీరోగా నటించిన సినిమా ఇది. రాజశేఖర్ కుమార్తె శివానీ కథానాయిక. చిత్రీకరణ పూర్తయ్యింది. సురేష్ ప్రొడక్షన్ ఈ సినిమాని చూసి, విడుదల చేయడానికి రెడీ అయ్యింది. `118`తో గుహన్ పనితనం ఏమిటో అందరికీ తెలిసింది. చాయాగ్రహకుడిగానే కాకుండా.. దర్శకుడిగానూ తనకో విజన్ ఉందని తొలి సినిమాతోనే నిరూపించాడు. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో ముందుకొస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.