మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఫడ్నవీస్ ఎంపిక లాంఛనమే. ఈ మేరకు సంకేతాలు రావడంతో ఇప్పటి వరకూ సీఎంగా ఉన్న షిండే తెల్ల జెండా ఎత్తేశారు. మోదీ మాట అంటే బీజేపీ కార్యకర్తలకు ఎంతో…తనకూ అంతేనని.. ఏ పదవి ఇచ్చినా అది చాలని ఆయన నేరుగా చెప్పేశారు. కేంద్రమంత్రిగా ఉంటావో.. డిప్యూటీ సీఎంగా ఉంటావో నీ ఇష్టమని బీజేపీ పెద్దలు చెప్పేశారని అంటున్నారు.
శివసేన పార్టీని చీల్చి.. ఇప్పుడు అసలైన శివసేన తనదే అని ఆయన నిరూపించుకున్న తర్వాత బీజేపీ ఏదంటే అదే అని ఆయన ఇప్పుడు అంటున్నారు. శివసేన పార్టీ గతంలో బీజేపీని డిక్టేట్ చేసేది. మహారాష్ట్ర కూటమిలో పెద్ద పార్టీ శివసేనగానే ఉండేది. ఇప్పుడు ఆ పార్టీని షిండే..బీజేపీకి తోక పార్టీగా మార్చేశారు. ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రాధాన్య శాఖలు ఇవ్వకపోయినా ఆయన మాట్లాడే పరిస్థితి లేదు.
శివసేనను చీల్చినప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనకు సీఎం పదవి ఇచ్చింది. ఫడ్నవీస్ ను ఉపముఖ్యమంత్రిగా పెట్టింది. సీఎంగా చేసిన తాను డిప్యూటీ సీఎం ఏమిటి అని ఫడ్నవీస్ అనుకోలేదు. ఎందుకంటే భవిష్యత్ రాజకీయాలు ఆయనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు అదే మాట షిండే అనుకోలేరు. ఎందుకంటే భవిష్యత్ రాజకీయాలు ఆయనకు కూడా తెలుసు కాబట్టి. ఇక శివసేనను నిర్వీర్యం చేసి ఆ బలం కూడా తానే పొందేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పోరాటం తనకు కొత్త కాదని షిండే అన్నారు. ఇక పోరాడాల్సిందే .. !