మర్రిచెట్టు నీడలో మరేమొక్క పెరగనట్లే, భాజపా నీడలో తమ పార్టీ కూడా ఎదగలేకపోయిందని మహారాష్ట్రాలో శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ టాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన 56వ పుట్టిన రోజు సందర్భంగా తన పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాజపాతో స్నేహం తమకి చాలా బారీ పడిందని చెప్పడం విశేషం.
“సుమారు 25ఏళ్లుగా మనం భాజపాతో కలిసి సాగుతున్నాము. ఆ కారణంగానే మనం పూర్తిగా నిర్వీర్యమైపోయాము. అదే భాజపాతో చేతులు కలపకుండా మనంతట మనమే సాగి ఉండి ఉంటే ఈ పాటికి రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించి ఉండేవాళ్ళమి. భాజపాకున్న జాతీయవాదం దృక్పధం కారణంగానే దానితో స్నేహం కొనసాగిస్తున్నాము తప్ప అధికారం చేజిక్కించుకోవడానికో మరొకందుకో కాదు,” అని ఉద్ధవ్ టాక్రే అన్నారు.
ప్రస్తుతం మహారాష్ట్రాలో భాజపా ప్రభుత్వంలో శివసేన కూడా భాగస్వామిగా ఉంది. ఏపిలో తెదేపా-భాజపాలు ఏవిధంగా కీచులాడుకొంటారో మహారాష్ట్రాలో శివసేన-భాజపా నేతలు కూడా అలాగే కీచులాడుకొంటుంటారు. ఏపిలో అధికారంలో ఉన్న తెదేపా డామినేషన్ ఎక్కువగా ఉంటే, మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వంపై శివసేన డామినేషన్ ఎక్కువగా కనబడుతుంది. కనుక దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం పరిస్థితి ఎప్పుడూ తుమ్మితే ఊడిపోయే ముక్కులాగానే ఉంటుంది. దానిని బట్టి చూస్తే భాజపా నీడలో శివసేన ఉందనే మాట కూడా సరికాదని అర్ధమవుతోంది. కనుక శివసేన ఎదగలేదని కానీ, ఎదగలేకపోవడానికి భాజపాని తప్పు పట్టడం గానీ సరికాదు.
అధికారం కోసం కాకపోతే శివసేన భాజపా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది? భాజపాతో స్నేహం చేయకపోయుంటే చాలా బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ఉండేవాళ్ళమీ అంటే అర్ధం ఎవరి సహాకారం మద్దతులేకుండానే అధికారం సంపాదించుకోవడమనే కదా అర్ధం. కనుక శివసేనకి అధికార లాలస లేదనే మాట కూడా అవాస్తవం.
ఇక జాతీయవాదం కారణంగానే భాజపాతో కలిసిసాగుతున్నామనే మాట కూడా అర్ధ సత్యమే. నిజానికి ఆ రెండు పార్టీలని దగ్గరకి చేర్చింది హిందుత్వం. వాటి మతతత్వమే. ఆ రెండు పార్టీలు హిందుత్వాన్నే జాతీయవాదం అనుకొంటే అది వాటి ఇష్టం కానీ దేశప్రజలు ఆ వాదనతో ఏకీభవించరు. శివసేన ప్రాంతీయవాదం గురించి తెలిసినవారు ఉద్ధవ్ టాక్రే నోట జాతీయవాదం గురించి మాటలు వింటే పక్కుమని నవ్వకుండా ఉండలేరు. గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రా, తెలంగాణా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడినవారి పట్ల శివసేన ఎంత అనుచితంగా ప్రవర్తిస్తుంటుందో ఆ బాధలు అనుభవించిన వారికే తెలుసు. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మహారాష్ట్రీయులు తప్ప వేరే రాష్ట్రాల వారెవరికీ ఉండే హక్క ఉ లేదని వాదించే శివసేనది జాతీయవాదం ఎలాగ అవుతుంది?