పాకిస్తాన్ దేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలలో మహారాష్ట్రలోని శివసేన కూడా ఒకటి. అందుకే అది కూడా కాంగ్రెస్ పార్టీతో బాటు ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ పర్యటనను తప్పుపడుతూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో లాహోర్ వెళ్లినందుకు మోడీని తీవ్రంగా విమర్శించడమే కాకుండా ఇక మోడీ కూడా ఎంతో కాలం అధికారంలో ఉండరని జోస్యం కూడా చెప్పింది. అందుకోసం ఒక సెంటిమెంటు కూడా ప్రయోగించింది.
“పాక్ నేలపై అడుగుపెట్టిన భారతీయ రాజకీయ నాయకుల రాజకీయ జీవితం పరిసమాప్తం అయిన సంగతి గమనించకుండా మోడీ పాక్ లో పర్యటించి వచ్చేరు. ఇదివరకు లాల్ కృష్ణ అద్వానీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిల రాజకీయ జీవితాలు పాక్ వెళ్ళివచ్చిన తరువాత ఏవిధంగా ముగిసాయో గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. లాల్ కృష్ణ అద్వానీ పాకిస్తాన్ వెళ్లి మహమ్మద్ అలీ జిన్నా సమాధిని దర్శించి వచ్చేరు. ఆ తరువాత నుండి ఆయన రాజకీయ జీవితంలో తిరోగమనం మొదలయి, చివరికి స్వంత పార్టీలోనే పక్కన పెట్టబడ్డారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి లాహోర్ వెళ్లి ముషరఫ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేరు. ఆ తరువాత మళ్ళీ ఆయన మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడు మోడీ పాక్ గడ్డపై అడుగుపెట్టారు. లక్షలాది మంది భారతీయుల రక్తంతో తడిసిన పాక్ నేల శాపగ్రస్తమయింది. అందుకే దానిపై అడుగుపెట్టిన భారతీయ నేతలకు కూడా ఆ శాపం తగులుతోంది. దానికి మూల్యం చెల్లించవలసి వస్తోంది. ఒకవేళ యూపీఏ ప్రభుత్వ హయంలో మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఈవిధంగా ఆకస్మికంగా పాక్ పర్యటించి వచ్చినట్లయితే అప్పుడు బీజేపీ ఏవిధంగా స్పందించి ఉండేది? ఇప్పటిలాగే స్వాగతించి ఉండేదా? లేక తప్పు పట్టేదా?” అని సామ్నా పత్రికలో శివసేన బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.