పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ మమ్మూద్ కసౌరి వ్రాసిన “నైదర్ ఏ హాక్ నార్ ఏ డోవ్” అనే ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం ముంబైలో జరపడానికి వీలులేదని శివసేన హెచ్చరించింది. కానీ ఆ కార్యక్రమం సజావుగా సాగేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోలీస్ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ శివసేన కార్యకర్తలు కొందరు లోనికి జొరబడి ఆ పుస్తకావిష్కరణ చేసిన భారత మాజీ దౌత్యవేత్త సుధీంద్ర కులకర్ణి మొహం మీద నల్ల రంగు పోశారు. అందుకు బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీతో సహా దేశంలో అన్ని వర్గాల నుండి శివసేన తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ శివసేన తన కార్యకర్తల చర్యలను గట్టిగా సమర్ధించుకొంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన మద్దతు ఇస్తూ దానిలో అదికూడా భాగస్వామిగా ఉంది. కానీ ఈ వివాదంలో బీజేపీ నేతలు కూడా తమను తీవ్రంగా విమర్శిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి తన మంత్రులు అందరినీ రాజీనామాలు చేయించి వెనక్కి రప్పించబోతున్నట్లు శివసేన ప్రతినిధి ఒకరు చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ టాక్రే ఈరోజు తన నిర్ణయం ప్రకటించవచ్చును. మహారాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రులను వెనక్కి తీసుకొంటే నష్టం లేదు కానీ మద్దతు ఉపసంహరించుకొంటే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం పడిపోతుంది. కనుక పరిస్థితులు చక్కదిద్దేందుకు బీజేపీ నేతలు ఈపాటికే రంగంలో దిగి ఉండవచ్చును.