అసోంలో మొట్ట మొదటిసారిగా భాజపా అధికారం చేజిక్కించుకోవడంతో దాని గురించి చాలా గొప్పలు చెప్పుకొంటోంది. కానీ మహారాష్ట్రలో భాజపాకి మిత్రపక్షంగా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన భాజపా గాలి తీసేసింది.
నిన్న వెలువడిన ఫలితాలపై శివసేన అధికారిక పత్రిక సామ్నాలో “అసోంలో ప్రాంతీయ పార్టీలని కలుపుకొని పోవడం వలననే భాజపా విజయం సాధించగలిగింది. బిహార్ లో ఘోర పరాభవం తరువాత అసోంలో విజయం భాజపాకి కొంత ఉపశమనం కలిగిస్తుంది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉగ్రవాదితో పోల్చారు. ఆ రాష్ట్రంలో అరాచకం నెలకొని ఉందని చెప్పారు. కానీ అక్కడి ప్రజలు ఆమెకే ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించడాన్ని ఏమనుకోవాలి? ప్రజలు ఆమె పరిపాలనను మెచ్చుకొనే ఓట్లు వేశారని స్పష్టం అవుతోంది. భాజపాకి కేవలం మూడు సీట్లే వచ్చాయి. కనీసం కాంగ్రెస్ పార్టీకి వచ్చినన్ని సీట్లు కూడా రాలేదక్కడ. దక్షిణాదిన భాజపా కనబడనే లేదు,” అని వ్రాసింది.
భాజపా పట్ల శివసేన వ్యవహరిస్తున్న ఈ తీరు చూస్తే, ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షాలుగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కూడా ఉన్న తెదేపా, భాజపాల సంబంధాల గురించి, వాటి పరస్పర వ్యవహార శైలి గురించి ఆలోచించకుండా ఉండలేము. తెదేపా ఏనాడూ భాజపా గురించి ఇంత గట్టిగా మాట్లాడలేదు. భాజపా మిత్రపక్షం కనుక దానిని ఈ విధంగా విమర్శించనవసరం లేదు కానీ హామీల అమలు విషయంలో గట్టిగా అడగడానికి మిత్రధర్మం అడ్డువస్తే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. రాష్ట్ర భాజపా నేతలు, కేంద్రం తెదేపా ప్రభుత్వాన్ని లెక్కలు చెప్పమని గట్టిగా అడుగుతున్నప్పుడు, తెదేపా కూడా హామీల అమలుగురించి గట్టిగానే అడగవచ్చు. అడగకపోతే అపనిందలు, విమర్శలు, అపోహలు తప్పవు.