‘ఆచార్య’ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈసినిమా వల్ల చాలామంది నష్టపోయారు. బయ్యర్లు కొరటాల శివ ఆఫీసుపై దండెత్తి వచ్చారు. కొరటాల కిందా మీదా పడి, ఆ ఇష్యూని సెటిల్ చేసేశారు. అయితే.. `ఆచార్య`కు రావాల్సిన బాకీలు చాలా ఉన్నాయి. వాటిలో శాటిలైట్ ఒకటి. జెమీని టీవీ ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని ఏకంగా రూ.15 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఆ డబ్బులు ఇంకా రాలేదు. అవొస్తే… కొరటాలకు కాస్త ఉపశమనం దక్కేది. కానీ ఇప్పుడు ఆ డబ్బులు కూడా రిస్కులో పడిపోయాయి.
ఈ సినిమాని విడుదలకు ముందే కొనేసింది జెమినీ. అయితే సినిమా ఫ్లాపయ్యింది. టీవీల్లో కూడా రేటింగులు రాని పరిస్థితి. రేటింగులు రాకపోతే… యాడ్లు ఉండవు. అలా.. ఈ సినిమాతో జెమినీ కూడా నష్టపోవాలి. అందుకే ఇప్పుడు ఆ రూ.15 కోట్లు ఇవ్వడానికి జెమినీ ఒప్పుకోవడం లేదు. దానికి తోడు.. శాటిలైట్ సమయంలో చేసుకొన్న ఎగ్రిమెంట్లని చూపిస్తోంది. జెమినీకి ఈ సినిమా అమ్మేస్తున్నప్పుడు.. ఆచార్యలో కాజల్ ఉంది. ఇప్పుడు ఆమె లేదు. ఆ సాకు చూపించి `ఈ సినిమా మాకొద్దు.. మీరే ఉంచుకోండి` అని వెనక్కి ఇచ్చే ప్రయత్నం చేస్తోందట. లేదంటే. రూ.7.5 కోట్లకు డీల్ చేసుకొందాం.. అని అడుగుతోందట. సినిమాని వెనక్కి తీసుకొంటే, జెమినీ నుంచి తీసుకొన్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి. సగానికి సర్దుకుపోతే, రూ.7.5 కోట్లు నష్టపోయినట్టు. ఈ వ్యవహారం కూడా ఇప్పుడు కొరటాలకు కొత్త చిక్కుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది.