అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ ముగిసిన తర్వాతి రోజు .. అంటే శుక్రవారం.. బీజేపీలో ఓ మాదిరి గుర్తింపు ఉన్న నేతలంతా.. ఓ రేంజ్లో మీడియా ముందు తన నోటి పవర్ చూపించారు. పురంధేశ్వరి.. ఏపీకి నిజమైన ద్రోహులెవరో తేలిపోయిందని… చెప్పారు. అయితే ఇందులో బీజేపీకి వ్యతిరేంగా ఎలాంటి అర్థం లేదు. ఆమె తెలుగుదేశం పార్టీ గురించే చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చొక్కాలు చింపుకున్నంత పని చేశారు. అసలు ఏపీని ఆదుకున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ తీర్పిచ్చేశారు. అయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక పలాయనవాదం అని రాయడం ఆయనకు నచ్చలేదు. దాంతో ఆ పత్రికపైనా… తన అక్కసు వెళ్లగక్కారు.
ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రైల్వేజోన్ తీసుసుకొస్తాననే సింగిల్ ఎజెండాతో ప్రచారం చేసుకుని గెలిచిన.. మాధవ్ అనే రాజకీయ వారసుడు… మరింత ముందుకెళ్లిపోయారు. టీడీపీలో తిరుగుబాటు వస్తుందని జోస్యం చెప్పేశారు. పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస చర్చలో బీజేపీదే పైచేయి అని చెప్పుకొచ్చారు. ఇక పార్లమెంట్లో తానే ఆర్థిక మంత్రినన్నట్లుగా… అకౌంట్ నెంబర్ వేస్తే..బ్యాంకులు తెరిచే సమయానికి డబ్బులేస్తానన్నట్లుగా ఆవేశపడిపోయిన హరిబాబుకు మాత్రం… విశాఖకు వచ్చేసరికి కాస్త దిగిపోయింది. తాను పదవి నుంచి దిగిపోయేలోపు రైల్వేజోన్ వస్తుందని కాస్త సౌమ్యంగానే చెప్పుకున్నారు. అంటే పదవీ కాలం అయిపోయేలోపు తనను అడగవద్దని చెప్పారన్నమాట. ఆ తర్వాత అడిగితే… నేనిప్పుడు ఎంపీని కాదనే ఆన్సర్ రెడీగా ఉంచుంటారమో..? విభజన సమయంలో కాంగ్రెస్ నేతలు ఉంచుకున్నట్లు..!
పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో.. దేశంలో ప్రధాన సమస్యలన్నింటినీ పార్టీలు లేవనెత్తాయి. ఒక్కటంటే..దానికి కూడా అధికార పక్షం నుంచి సమాధానం రాలేదు. మోదీ రాజకీయ విమర్శలతో గంటన్నర సమయం తినేశారు. చరిత్ర చెప్పుకుని… కాంగ్రెస్ నేతలు ఎవరెవర్నో అమానించారంటూ..చెప్పుకునేందుకు తాపత్రయ పడ్డారు. అత్యంత హీనమైన ప్రవర్తనతో నరేంద్రమోడీకి తనపై సానుభూతి పరుల్లో ఉండే పాజిటివ్ భావనను కూడా దూరం చేసుకున్నారు. కానీ ఆయన శిష్యులకు మాత్రం.. అంతా మాదే పైచేయి అన్నట్లుగా అర్థమైపోయింది. అడ్డదిడ్డమైన వాదనలతో… మీడియా ముందు చెలరేగిపోతున్నారు. నిజంగా అవిశ్వాసంపై చర్చలో పైచేయి సాధించి ఉంటే… ఇక ఏపీలో గెలవబోతున్నాం.. కాషాయ రంగు చల్లుకుంటూ ఉండేవారేమో..?