తెలంగాణలో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నిరాశపర్చాయి. ఒక్క జడ్పీ పీఠం కూడా దక్కే అవకాశం లేదు. ఆరు జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. పార్లమెంట్ ఫలితాల సంతోషం కాంగ్రెస్ కి కొద్ది రోజుల్లో ఆవిరైపోయింది. స్థానిక సంస్థల్లో ఎంతో కొంత పుంజుకుంటామని ఆశ పడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
నానాటికి తీసికట్టుగా కాంగ్రెస్ ..!
స్థానిక సంస్థల్లో పార్లమెంట్ ఫలితాలే రిపీట్ అవుతాయని హస్తం పార్టీ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. 538 జడ్పీటీసీ స్థానాలుండగా కనీసం వంద స్టానాలు కూడా గెలుచుకోలేకపోయింది. కేవలం 74 స్థానాలకే పరిమితమైంది. 32 జిల్లా పరిషత్ చైర్మన్ లలో ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కుంచుకోలేక చతికిల పడింది. అయితే ఎంపిటిసి ఎన్నికల్లో మాత్రం 13 వందలకు పైచీలుకు గెలిచినా… జడ్పీటిసి ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు మాత్రం రాబట్టలేక పోయింది. 32 జిల్లాల్లోనూ టిఆర్ఎస్ హవా కొనసాగింది. కామారెడ్డి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ కొంత పోటీ ఇవ్వగలిగింది.కామారెడ్డి జిల్లాలో 8, నిర్మల్ 5, రంగారెడ్డి 5, భూపాలపల్లి 4., సంగారెడ్డి లో 4 , ఆదిలాబాద్ 3 జడ్పీటీసీ లు గెలుచుకుని కొంత ఊపిరి పీల్చుకుంది.
ఆరు జిల్లాల్లో జీరో.. తొమ్మిది జిల్లాల్లో ఒకటి..!
ఆరు జిలాల్లో కాంగ్రెస్ అసలు ఖాతా తెరవలేక పోయింది. వరంగల్ అర్బన్ ,వరంగల్ రూరల్,కరీంనగర్,జనగామ,మహబూబ్ నగర్,గద్వాల జిల్లాలో టిఆర్ఎస్ క్లీన్ స్వీఆప్ చేసింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్ , వరంగల్ జిలాల్లో కాంగ్రెస్ కనీసం పట్టు సాధించలేకపోయింది. పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించిన మూడు చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీనే విజయం సాధించడం విశేషం. ఇక 9 జిల్లాలో కాంగ్రెస్ ఒక్క సీటుకే పరిమితమైంది. ఒక్కసీటుకే పరిమితమైన జిల్లాలు
కొత్త రక్తం ఎక్కిస్తేనే భవిష్యత్..!
అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గాల నేతలు పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. వారి నుంచి మద్దతులేకపోయినా, ఆర్థిక సాయం పార్టీ నుంచి అందకపోయినా గ్రామస్థాయి నేతలే సొంతంగా పోటీ చేసి.. పరువు నిలిపారని కాంగ్రెస్ పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ను ప్రక్షాళన చేయకపోతే కష్టమన్నది మాత్రం నిజమన్నది వారి అభిప్రాయం.