తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ సీపీకి భారీ షాక్ తగిలింది. అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి అనురాధ ఆఖరి నిమిషంలో చేతులెత్తేశారు. ప్రచారం కూడా మానేసి పార్టీ కార్యాలయానికి తాళాలు వేయడంతో వైకాపా శ్రేణులు నివ్వెర పోతున్నాయి. వివరాల్లోకి వెళితే..
వైఎస్ఆర్సిపి అమలాపురం ఎంపీ అభ్యర్థిగా చింతా అనురాధకు టికెట్ ఇచ్చింది. వైఎస్ఆర్సిపిలో చాలా స్థానాలకు టికెట్లను భారీగా పార్టీ ఫండ్ ఇచ్చిన పారిశ్రామికవేత్తలకు కేటాయించినా, కొన్ని స్థానాలలో పార్టీకి బొత్తిగా బలం లేకపోవడంతో ఆయా స్థానాలకు అభ్యర్థులు ఆసక్తి చూపకపోవడంతో, జగన్ అంతగా బలం లేని అభ్యర్థులకు టికెట్ కేటాయించాల్సి వచ్చింది. అటువంటి స్థానాలలో ఒకటి అమలాపురం ఎంపీ స్థానం. అయితే ఆ స్థానం నుండి పోటీ చేస్తున్న చింత అనురాధ మాత్రం తాను ఖర్చు పెట్టుకోలేనని, పార్టీ నుండి సహాయం వస్తే తప్ప తాను ప్రచారం చేయలేనని ముందుగానే పార్టీ అధినేత జగన్ కు చెప్పింది.
అయితే ఇప్పటి వరకు పార్టీ నుండి ఎటువంటి సహాయం అందకపోగా, ఇటు కార్యకర్తలు ఏమో డబ్బులు పంచితే తప్ప ప్రచారానికి రాకపోవడంతో చింతా అనురాధ కి ఆఖరి నిమిషంలో చేతులెత్తేయడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. మిగతా స్థానాలలో ఎంపీ అభ్యర్థుల నుండి, ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి పార్టీ ఫండ్ బాగానే సేకరించినప్పటికీ, అవసరమైన అభ్యర్థులకు మాత్రం జగన్ చిల్లిగవ్వ కూడా విదల్చడం లేదని అమలాపురం వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అంటున్నారు. అయితే ప్రచారం మాని వేయడంతోపాటు, నిన్న రాత్రి నుండి అనురాధ పార్టీ కార్యాలయానికి తాళం వేసి ఇంట్లో కూర్చోవడం చూస్తుంటే , డబ్బు లేకపోతే వైఎస్ఆర్సిపి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది.
దీంతో ప్రస్తుతం అమలాపురం ఎంపీ నియోజకవర్గం నుండి పోటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హరీష్ మరియు జనసేన అభ్యర్థి డీ.ఎం.ఆర్. శేఖర్ ల మధ్య ఉండనుంది. అంతేకాకుండా, జనసేన పార్టీ మాదిరిగా, డబ్బు ఖర్చు పెట్టకుండా రాజకీయాలు చేయడం వై ఎస్ ఆర్ సి పి పార్టీకి గానీ , వైఎస్సార్సీపీ నేతలకు కాని సాధ్యం కాదని అటు అమలాపురం నియోజకవర్గం లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.