ఉత్తర్ ప్రదేశ్ లో పునర్ వైభవం కోసం తపిస్తున్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీలో అధికారంలోకి రావడం, లేదా గౌరవప్రదంగా సీట్లను పొందడం ఆ పార్టీ టార్గెట్. అందుకోసం ఓ జగమెరిగిన వ్యూహకర్తకు బాధ్యతలు అప్పగించింది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని జాతీయ స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దడానికి వ్యూహరచన చేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ . అత్యుత్తమ ప్రధాని అభ్యర్థిగా ఆన్ లైన్ లో మోడీకి ఓట్ల వెల్లువ రావడం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహ చతురత ఉంది. ఆన్ లైన్ వేదికగా ఆయన అద్భుతాలు చేశారు. అలా ప్రాచుర్యం పొందిన మోడీ, తన అనుభవం, వాక్చాతుర్యంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. యూపీఏ ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకుని ప్రధాన మంత్రి అయ్యారు.
మోడీ ప్రధాని అయిన కొద్ది కాలాలనికే ఆయన బృందం నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చారు. అప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వయంగా ప్రశాంత్ కిషోర్ ను తనకు వ్యూహకర్తగా పనిచేయాలని కోరారు. బీజేపీ తప్పిదాలను క్యాష్ చేసుకోవడం, నితీష్ కుమార్ క్లీన్ ఇమేజిని అమాంతం పెంచడం ద్వారా జేడీయూ, ఆర్ జే డీ, కాంగ్రెస్ మహా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు.
యూపీలో కాంగ్రెస్ గత వైభవం పొందాలంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అవసరమని కాంగ్రెస్ అదినేతలు సోనియా, రాహుల్ గాంధీ భావించారు. ఆయన్ని ఢిల్లీకి పిలిపించారు. యూపీలో తమకు సహాయం చేయాలని కోరారు. ఆయన అంగీకరించారు. అయితే, ప్రియాంకను ప్రచారానికి తెస్తే మంచి ఫలితాలుంటాయని మొదటి భేటీలోనే ఆయన కాంగ్రెస్ హైకమాండ్ కు సూచించారని సమాచారం. అయితే దీనిపై నిర్ణయం ఏదీ వెలువడలేదు.
యూపీలో కాంగ్రెస్ బలపడాలంటే ఇప్పుడున్న నాయకులు పనికిరారని ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రచార పర్వంలో దూసుకుపోవాలంటే గులాం నబీ ఆజాద్, షీలాదీక్షిత్, కమల్ నాథ్ వంటి నేతలను రంగంలోకి దింపాలనేది ఆయన ప్లాన్. దీనికి యూపీ నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. తమను పక్కకు తప్పించి ఇతర రాష్ట్రాల వారిని యూపీలో ప్రచారానికి దింపడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తనకు స్వేచ్ఛ లేకపోతే కాంగ్రెస్ కు సహాయం చేసే బాధ్యత నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. ఆయన చెప్పింది చేయడమా లేక తమ పార్టీ యూపీ నేతల మాటల వినడమా అనే డైలమాలో పడ్డారు సోనియా, రాహుల్ గాంధీ. ఒక వేళ ప్రశాంత్ కిషోర్ సేవలను వదులుకుంటే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ తప్పదని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.