‘నా పాటల్ని ఎవ్వరూ పాడుకోవడానికి వీల్లేదు’ అంటూ.. ఇళయరాజా న్యాయ స్థానం నుంచి ఓ స్టే ఆర్డరు తెచ్చుకొన్నాడు. ఇళయరాజా అంతటి వాడు… మరీ ఇలా వ్యవహరిస్తున్నాడేంటి? అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఇళయరాజాది డబ్బు వ్యామోహం అని కొందరంటే, ఎస్.పి బాల సుబ్రమణ్యం కూడా తక్కువ తినలేదని ఇంకొంతమంది మంది వాదించారు. ఇళయరాజా ట్రూప్లో పాటలు పాడడానికి బాలు ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడని, అందుకే బాలుకి చెక్ పెట్టడానికి ఇళయరాజా ఇలా వ్యవహరించాల్సివచ్చిందని చెప్పుకొన్నారు. మొత్తానికి ఎవరి పాటపై ఎవరికి హక్కుంది? అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాయల్టీ పై వాదోపవాదాలు జోరందుకొన్నాయి. అయితే.. ఇప్పుడో యువ సంగీత దర్శకుడు ఇళయరాజా స్టేట్మెంట్ కు విరుద్దంగా గళం ఎత్తాడు. ‘నా పాటలు ఎవరైనా నిరభ్యంతరంగా పాడుకోవొచ్చు’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తనే..మిక్కీ జే.మేయర్.
ఓ పాటని ఎంతమంది, ఎన్ని ఎక్కువ సార్లు పాడితే.. అంత పాపులారిటీ వస్తుందన్నది మిక్కీ లాజిక్. అదీ నిజమే. నేను తప్ప ఎవ్వరూ పాడకూడదు అనుకొంటే, ఆ పాటని సృష్టించడం ఎందుకు?? అయితే మిక్కీకి రాయల్టీలపై ఎలాంటి అవగాహన లేదట. ”ఓ పాట ఎవరికి సొంతం అనే విషయాల్లో నాకు ఎలాంటి అవగాహన లేదు. ఆ అవగాహన కొద్దీ ఇళయరాజా మాట్లాడి ఉంటారు. ఒకవేళ అందులోని లోటు పాట్లు నాకూ తెలిస్తే.. నేను వేరేలా స్పందించే వాడ్నేమో” అంటున్నాడు మిక్కీ. మొత్తానికి ఇళయరాజా స్టేట్మెంట్ కు విరుద్ధంగా ఓ సంగీత దర్శకుడు నోరు విప్పాడు. అదే సంతోషం.