ఆంధ్రప్రదేశ్లో ఇసుక చిత్ర విచిత్రాలు చేస్తోంది. ఆన్ లైన్లో బుక్ చేస్తే ఇంటికే తెచ్చిచ్చే విధానానని ఏపీ సర్కార్ అమలు చేస్తోంది. అయితే.. బుక్ చేయడం వరకు ఇసుకే చేస్తున్నారు కానీ… వస్తోంది మాత్రం ఇసుక కాదు.. ఇసుక లాంటిది. బుసక పేరుతో.. బురద, మట్టితో నిండిన ఇసుకను పంపిస్తున్నారని నిర్మాణ దారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే.. అదంతా.. ప్రతిపక్ష మీడియా చేసే దుష్ప్రచారం అని.. అధికార పార్టీ నేతలు లైట్ తీసుకున్నారు. కానీ… ఈ సారి .. అధికార పార్టీ నేత.. అదీ కూడా మంత్రిగా ఉన్న పినిపె విశ్వరూప్కే ఇసుకను కాకుండా.. ఇసుక లాంటి పదార్ధాన్ని పంపారు. ఆయన కట్టుకుంటున్న సొంత ఇంటికి అలాంటి ఇసుక రావడంతో ఆయన షాక్కు గురయ్యారు.
అది ఇంటి నిర్మాణానికి పనికి రాదని… మేస్త్రిలు తేల్చి చెప్పడంతో.. ఆయన నేరుగా కలెక్టర్కు ఫోన్ చేశారు. కలెక్టర్ ఆర్డీవోను పంపి పరిశీలన చేయించారు. ఆయన కూడా అది నిర్మాణానికి పనికి రాదని తేల్చారు. మంత్రి కాబట్టి.. ఆయనకు హై క్వాలిటీ ఇసుక.. ఈ పాటికి అంది ఉంటుంది. దాన్ని ఉపయోగిచుకుని ఆయన ఇల్లు కట్టుకుంటారు. కానీ సామాన్యుల పరిస్థితి ఏమిటి..? తమకు ఇసుకను పంపడం లేదని.. మట్టిని పంపుతున్నారని గగ్గోలు పెడుతున్నవారు ఎవరికి ఫిర్యాదు చేయాలి..? ఫిర్యాదు చేస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు..? ఇలాంటి విషయాలు ఆలోచిస్తే.. మాత్రం.. ఏపీలో సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారిపై జాలి పడటం మినహా ఏమీ చేయలేదు.
ఇసుక విషయంలో.. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల ధర భారీగా పెరగడమే కాదు… సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక పదిహేను వందలకు వచ్చేది ఇప్పుడు.. పదిహేను వేలకు దొరకడమే గగనంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణ రంగం పుంజుకోవాలంటే..ఇసుకే అత్యంత కీలకం. ఇసుక లభ్యతను ఎంత ఎక్కువ ఉంటే.. అంతగా నిర్మాణ రంగాలు కళకళలాడుతూంటాయి. లేకపోతే.. అనేక రంగాల ఉపాధిపై దెబ్బ పడుతుంది. ఇప్పుడు.. ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని.. ఈ ఘటన రుజువు చేస్తోంది.