ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీలు ఫిరాయించిన వారికి, ఆ ఫిరాయింపులను ప్రోత్సహించిన వారికి ఇదోరకంగా షాకింగ్ న్యూసే. అనర్హత వేటు భయాలేమీ లేకుండా.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎంచక్కా పార్టీలు మారిన వారి జర్నీ ప్రస్తుతానికి సాఫీగానే సాగుతోంది. అయితే.. వచ్చే ఎన్నికల విషయంలో ఇప్పటికే జరుగుతున్న రచ్చల్లోఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లోపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉద్దేశం ఏదీ తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రకటన కూడా చేశారు.
అది కూడా తెలుగుదేశం ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం నుంచి ఈ సమాధానం వచ్చింది. 2026 వరకూ ఏపీ, తెలంగాణల్లో నియోజకవర్గాలను పెంచే ప్రసక్తి లేదని.. కేంద్రం స్పష్టం చేసింది. 2026 వరకూ దేశంలో ఎక్కడా నియోజకవర్గాల పునర్విభజన ఉండదని, ఏపీ తెలంగాణలు విడిపోయినా ఈ పరిస్థితిలో మార్పు ఉండబోతోందని ఈ మేరకు సభలో క్లారిటీ ఇచ్చారు.
మరి ఈ నియోజకవర్గాల పెంపుకు, ఫిరాయింపుదారులకు ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పనక్కర్లేదు. తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ అయినా, ఏపీలో ఈ పని చేస్తున్న టీడీపీ అయినా.. ఆయా నియోజకవర్గాల్లో నేతలు ఉన్నా.. ఫిరాయింపుదారులను పిలుచుకుంటున్నాయి, మరి టికెట్ ఎవరికి అంటే.. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతోంది, ఇబ్బంది ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెరాస నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే అది జరిగే పనిలా కనిపించడం లేదు. 2009 కు ముందు పునర్విభజన జరిగిన నేపథ్యంలో విభజనతో సంబంధం లేకుండా 2026లో పునర్విభజన చేస్తామని కేంద్రం అంటోంది. దీంతో ఫిరాయింపుదారులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేలా ఉంది.